తమ పోరాటం వృథా... మాజీ రెజ్లర్ సంచలన నిర్ణయం!
ఈ ఎన్నికల్లో కామన్ వెల్త్ బంగారు పతక విజేత, రెజ్లర్ అనితా శ్యోరాణ్ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో భారత స్టార్ రెజ్లర్ల ఆమెకు మద్దతు పలికారు
బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ తదితర రెజ్లర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో డబ్ల్యూఎఫ్‌ఐ పాలక వర్గాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. ఈ సమయంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఒలింపిక్స్ లో భారత్ గోల్డ్ మెడలిస్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అవును... బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న సమాఖ్యకు కొత్త అధ్యక్షుడు వచ్చారు. అతడు మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు అత్యంత సన్నిహితుడైన సంజయ్ సింగ్ కావడం గమనార్హం. తాజాగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 47 ఓట్లకుగానూ 40 ఓట్లను సంజయ్ సింగ్ దక్కించుకున్నారు.
ఈ ఎన్నికల్లో కామన్ వెల్త్ బంగారు పతక విజేత, రెజ్లర్ అనితా శ్యోరాణ్ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో భారత స్టార్ రెజ్లర్ల ఆమెకు మద్దతు పలికారు. దీంతోనే ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే తాజాగా వచ్చిన ఫలితాలతో స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ తీవ్ర నిరాశకు గురయ్యారు! దీంతో ఇందుకు నిరసనగా తాను రెజ్లింగ్ నుంచి వైదొలుగుతానని ఆమె సంచలన ప్రకటన చేశారు.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన సాక్షి మాలిక్... "బ్రిజ్ భూషణ్ సింగ్ వ్యాపార భాగస్వామి, అతడికి అత్యంత సన్నిహితుడు సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికైతే.. నేనిక రెజ్లింగ్ ను విడిచిపెడతాను" అని ప్రకటించారు.
ఇదే సమయంలో సాక్షితో పాటు బజరంగ్ పునియా, వినేశ్ ఫోగాట్ లు ఈ ఫలితాలపై తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సమయంలో వినేశ్ ఫోగాట్ మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. మరోపక్క ప్రభుత్వం తమ మాటను నిలబెట్టుకోలేకపోయిందంటూ బజరంగ్ పునియా ఫైరయ్యారు.
కాగా... బ్రిజ్ భూషణ్ డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ స్టార్ రెజ్లర్లు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఒకానొక దశలో ఢిల్లీ రోడ్లపై హల్ చల్ చేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దీంతో డబ్ల్యూఎఫ్‌ఐ పాలక వర్గాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది.
ఈ సమయంలో డబ్ల్యూఎఫ్ఐ సమాఖ్య రోజువారీ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం భారత ఒలింపిక్ సంఘం అడ్ హక్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ కోసం ఈ కమిటీ ప్రయత్నించగా... కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. మరోవైపు గడువు లోగా ఎన్నికలు జరగకపోవడంతో యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య డబ్ల్యూఎఫ్ఐ పై నిషేధం విధించింది.
కాగా... తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన సంజయ్ సింగ్.. ఉత్తర్ ప్రదేశ్ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే డబ్ల్యూఎఫ్‌ఐ కి సంయుక్త కార్యదర్శిగానూ పనిచేశారు. ఇతడు బ్రిజ్ భూషణ్ సింగ్ కు వ్యాపార భాగస్వామి కావడంతో పాటు అత్యంత సన్నిహితుడు కూడా అని చెబుతూ సాక్షి మాలిక్ సంచలన నిర్ణయం ప్రకటించారు. దీంతో ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది.