చంద్రబాబు యాగం ముగిసింది.. యజ్ఞం మిగిలింది...!
టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు చేసిన రాజశ్యామల యాగం ముగిసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ యాగం ఆదివారం సాయంత్రంతో పూర్ణాహుతితో సమాప్తమైంది.
టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు చేసిన రాజశ్యామల యాగం ముగిసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ యాగం ఆదివారం సాయంత్రంతో పూర్ణాహుతితో సమాప్తమైంది. గత ఏడాది ఆయన ఉండవల్లిలోని నివాసంలో ప్రత్యేక యజ్ఞాలు జరిపించిన విషయం తెలిసిందే. అప్పట్లో జైలు నుంచి బయటకువచ్చిన తర్వాత.. పండితుల సూచనల మేరకు వీటిని నిర్వహించారు. ఇక, ఇప్పుడు కీలకమైన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు.. అత్యంత శక్తిమాన్వితమని చెప్పే రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు.
గుంటూరు, రాజమండ్రిల నుంచి ప్రత్యేకంగా పిలిపించిన పురోహితులతో ఈ యాగాన్ని శాస్త్రోక్తంగా చంద్రబాబు దంపతులు నిర్వహించారు. నివాసంలోనే అతి పెద్ద రాజశ్యామల అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అధికారం, ఆరోగ్యం సహా.. సకల భోగాలను కాంక్షిస్తూ.. ఈ యాగం చేయడం గమనార్హం. గత 2019 ఎన్నికలకు ముందు.. వైసీపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ.. విశాఖలోని శారదాపీఠం అధిపతి.. స్వరూపానందేంద్ర ఈ యాగాన్ని జగన్ చేతుల మీదుగా జరిపించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.
ఇక, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా.. గత ఏడాది డిసెంబరులో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ యాగం నిర్వహించారు. అయితే.. ఆయన అధికారం దక్కించుకో లేక పోయారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది. మరి ఆయన కోరిక ఏమేరకు ఫలిస్తుందో చూడాలి. ఇదిలావుంటే.. ఇప్పుడు కీలకమైన ఎన్నికల యజ్ఞం మిగిలింది. రాష్ట్రంలోని 120-130 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. జనసేనకు 25 సీట్లు కేటాయించే అవకాశం ఉందని.. మిగిలిన స్థానాలను బీజేపీకి ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు పక్కా వ్యూహంతో ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో నాయకుల బలమే కీలకంగా మారింది. ఈ విషయం ఇటీవల కాలంలో తరచుగా చర్చకు వస్తోంది. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నా.. అంతర్గత సంభాషణల్లో నాయకులు తల్లడిల్లుతున్నారు. తాజాగా నారా లోకేష్ కూడా.. పార్టీ కార్యకర్తలకు హెచ్చరికలతో కూడిన సూచనలు చేశారు. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా ఉండాలని.. క్షేత్రస్థాయిలో బాబు ష్యూరిటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఇలా చేస్తే భవిష్యత్తులో వారికి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. సో.. అసలైన యాగం ముగిసినా.. ఎన్నికల యజ్ఞం మిగిలి ఉండడం దీనిని ఎలా ఎదుర్కొంటారనే చర్చ జరుగుతుండడం గమనార్హం.