యనమల రాజకీయాల నుంచి తప్పుకోవడమే మంచిదా..!
కొత్త నీరు వచ్చినప్పుడు.. సహజంగానే పాత నీరు కొట్టుకుపోతుంది! లేదంటే.. మురుగు పట్టి దుర్వాసన కొడుతుంది.
కొత్త నీరు వచ్చినప్పుడు.. సహజంగానే పాత నీరు కొట్టుకుపోతుంది! లేదంటే.. మురుగు పట్టి దుర్వాసన కొడుతుంది. అది రాజకీయాలైనా అంతే! కొత్త నేతలు వచ్చినప్పుడు సహజంగానే పాత నాయకులకు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. పైగా మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న రాజకీయాల్లో పాతతరం నేతలకు కొంత వెనుకబాటు తప్పడం లేదు. లేదా.. వారు లైవ్‌లోనే ఉండాలని అనుకుంటే కొత్త తరాన్ని కూడా కలుపుకొని పోవాలి. లేదా.. గౌరవంగా తప్పుకోవాలి.
ఇప్పుడు ఇలాంటి చిక్కే సీనియర్ మోస్టు నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు ఎదురవుతోందని అంటున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు. ఈ మొత్తం జిల్లాలో రెండు కీలక ఎంపీ స్థానాలను కూటమి పార్టీలు దక్కించుకున్నాయి. రాజమండ్రిని బీజేపీ దక్కించుకుంటే.. కాకినాడను జనసేన కైవసం చేసుకుంది. ఈ రెండు పార్టీలతోనూ యనమల డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. పైగా.. సొంత పార్టీలోనే ఆయన హవా దాదాపు తగ్గిపోయింది.
గతంలో ఓ యువ నాయకుడిని ఆయన అవమానించారన్న చర్చ ఉండడం.. అప్పట్లోనే అది వివాదం కావడం.. తాజాగా కూటమిసర్కారులో ఆ యువ నాయకుడు కీలక రోల్ పోషిస్తున్న క్రమంలో యనమల కు ప్రాధాన్యం రాను రాను తగ్గుతోందన్నది కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చే. ఆయన కుమార్తె ఎమ్మెల్యే అయి నా.. తానే చక్రం తిప్పాలని సహజంగానే యనమల భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నా రు. కానీ, జిల్లా మొత్తంపై ఒకప్పుడు పట్టున్న మాట వాస్తవమే అయినా.. ఇప్పుడు సొంత నియోజకవర్గం లోనే ఆయన మాటకు వాల్యూ లేకుండా పోయిందన్న చర్చ ఉంది.
కొత్త తరం నాయకులు.. రాజకీయాల్లోకి రావడం.. ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో జనసేన దూకుడును పెంచాలని ఎంపీగా ఉన్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నిర్ణయించుకున్న దరిమిలా.. యనమల ప్రాభవం నానాటికీ తగ్గుతోంది. మరోవైపు టీడీపీ అధిష్టానం కూడా.. ఒకప్పుడు ఇచ్చిన వాల్యూ ఇప్పుడు ఇవ్వడం లేదు. అయినా.. నాదే పైచేయి అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఇప్పుడు యనమల మాటను ఎవరూ పట్టించుకోవడంలేదు. అంటే.. మొత్తానికి యనమల గౌరవంగా తప్పుకోవడమే మంచిదన్నసూచనలు వస్తున్నాయి. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.