టీడీపీలో చేరనున్న యార్లగడ్డ
2024 ఎన్నికలలో పులివెందుల నుంచి జగన్, గన్నవరం నుంచి తాను గెలిచి శాసనసభలో అడుగుపెడతామని ధీమా వ్యక్తం చేశారు.
గన్నవరం వైసీపీలో వర్గ పోరు కొంతకాలంగా వైసీపీ అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసిపి నేత యార్లగడ్డ వెంకట్రావుల మధ్య సఖ్యత కుదరకపోవడంతో అక్కడ అంతర్గత విభేదాలు రోడ్డుకెక్కాయి. ఈ నేపథ్యంలోనే యార్లగడ్డ త్వరలోనే పార్టీ మారబోతున్నారు అని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా యార్లగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను వైసీపీని వీడుతున్నానని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే చంద్రబాబును కలుస్తానని, టీడీపీ టికెట్ కోరతానని యార్లగడ్డ షాకింగ్ కామెంట్స్ చేశారు. గత మూడున్నరేళ్లలో తాను చంద్రబాబు, లోకేష్ లలో ఎవరినీ కలవలేదని, తాను కలిసినట్టుగా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని యార్లగడ్డ సవాల్ విసిరారు. తాను వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్టుగా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, అందుకే రాబోయే ఎన్నికల్లో గన్నవరం నుంచి గెలుపొంది నేరుగా అసెంబ్లీలో ఆయనను కలుస్తానని ఛాలెంజ్ చేశారు.
2024 ఎన్నికలలో పులివెందుల నుంచి జగన్, గన్నవరం నుంచి తాను గెలిచి శాసనసభలో అడుగుపెడతామని ధీమా వ్యక్తం చేశారు. తాను, గన్నవరం టికెట్ అడిగానని, కానీ పార్టీ పెద్దలకు ఆ విషయం ఎలా అర్థమైందో తనకు తెలియదని సజ్జల వ్యాఖ్యలనుద్దేశించి యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్ బతికుంటే ఇలా జరిగి ఉండేది కాదని అన్నారు.
గన్నవరం అభ్యర్థిగా తాను సరిపోనని సజ్జల అన్నారని, పార్టీ కోసం 2019లో తన బలం సరిపోయిందని, కానీ ఇప్పుడు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరంలో వైసీపీని అభివృద్ధి చేశానని, కేడీసీసీ బ్యాంకు ను డెవలప్ చేసిన తాను పనికిరాని పక్కన పెట్టారని అన్నారు.