బిగ్ బ్రేకింగ్.. గన్నవరం టీడీపీ ఇంచార్జి అతడే!
అంతా ఊహించినట్టే జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఇంచార్జిగా యార్లగడ్డ వెంకట్రావును నియమించారు
అంతా ఊహించినట్టే జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఇంచార్జిగా యార్లగడ్డ వెంకట్రావును నియమించారు. ఈ మేరకు ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు.
కాగా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గన్నవరంలో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ చేతిలో 800 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మరోవైపు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వల్లభనేని వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
మరోవైపు గత ఎన్నికల్లో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుకు కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవిని ఇచ్చారు. అయితే ఆ పదవిలో ఆయనను కేవలం 13 నెలలే ఉంచారు. ఆ తర్వాత తాతినేని పద్మావతికి అప్పగించారు. ఇంకోవైపు వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీకే వైసీపీ అధినేత జగన్ సీటును ఖరారు చేశారు.
దీంతో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలను వంశీ నడుపుతున్నారు. అధికారులు కూడా ఆయనే మాటే వింటుండటంతో యార్లగడ్డ పలు సందర్భాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో వంశీ పొడ గిట్టని మరో వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుతో కలిసి యార్లగడ్డ వెంకట్రావు.. వంశీని వ్యతిరేకిస్తూ వచ్చారు. వంశీకి సీటు ఇస్తే సహించేది లేదని.. ఆయనకు సహకరించబోమని తేల్చిచెప్పారు. అయితే వైసీపీ అధిష్టానం వంశీనే గన్నవరంలో పోటీ చేస్తారని తేల్చిచెప్పింది.
ఈ పరిణామాల నడుమ ఇటీవల తన అనుచరులు, శ్రేయోభిలాషులతో వరుస సమావేశాలు నిర్వహించిన యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి వచ్చారు. టీడీపీలో చేరికకు సుముఖత వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నుంచి సరాసరి గన్నవరం వచ్చిన యార్లగడ్డ వెంకట్రావు.. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. గన్నవరంలో జరిగిన బహిరంగ సభలో టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ గన్నవరం ఇంచార్జిగా యార్లగడ్డను లోకేశ్ ప్రకటించారు.
కాగా గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వంశీ వైసీపీలో చేరడంతో ఇన్నాళ్లూ ఆ పార్టీకి అభ్యర్థులు లేకుండా పోయారు. దీంతో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుని గన్నవరం ఇంచార్జిగా నియమించారు. ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆ తర్వాత బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను ఇంచార్జిగా నియమించారు. అయితే ఆయన స్థానికుడు కాదు. దీంతో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చందు తల్లి అపర్ణ, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తదితరులు టీడీపీ సీటును ఆశించారు.
అలాగే మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్దన్ రావు కూడా మళ్లీ టీడీపీలో చేరతారని.. ఆయనకే సీటు లభిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్లన్నింటికీ తెరదించుతూ యార్లగడ్డ వెంకట్రావునే గన్నవరం నియోజకవర్గ ఇంచార్జిగా లోకేశ్ ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వంశీ వైసీపీ అభ్యర్థిగా, యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమైంది.
కాగా నారా లోకేశ్ సమక్షంలో వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్‌లు, సహకార బ్యాంక్ సభ్యులు, ఇతర నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓటమి కోసం తామంతా కలసి కట్టుగా పనిచేస్తామని తెలిపారు. టీడీపీ కంచుకోటలో పసుపు జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.