నయా ట్రెండ్: వర్కు ఫ్రం హాస్పిటల్ కు తెర తీసిన కార్పొరేట్ ఆసుపత్రి

అవును.. హైదరాబాద్ మహానగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రి సరికొత్త విధానానికి తెర తీసింది

Update: 2024-02-26 16:30 GMT

అవును.. హైదరాబాద్ మహానగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రి సరికొత్త విధానానికి తెర తీసింది. ఇప్పటి వరకు మరే ఆసుపత్రిలో లేని ప్రత్యేక వసతిని ఏర్పాటు చేసింది. ఆసుపత్రి అన్నంతనే వైద్యం.. చికిత్స మాత్రమే అన్న రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. ఖర్చుకు వెనకాడకుండా ఉండాలే కానీ.. ఎలాంటి వసతిని అయినా అందుబాటులోకి తీసుకొచ్చే ట్రెండ్ కు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు తెర తీశాయి. దీనికి మరో అడుగు ముందుకేస్తూ హైటెక్ సిటీలోని యశోదా ఆసుపత్రి మరో కొత్త వసతిని కల్పించటం ఆసక్తికరంగా ఉంది.

ఇంట్లో పెద్ద వయస్కుల వారు ఉన్నా.. చిన్న పిల్లలు ఉన్నా వారికి ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య వస్తుందో అర్థం కాని పరిస్థితి. వారికి ఆరోగ్యం బాగోనప్పుడు ఆసుపత్రిలో చేర్చాల్సిన వచ్చినప్పుడు ఎదురయ్యే ఒత్తిళ్లు అన్ని ఇన్ని కావు. ఆసుపత్రిలో వైద్యులు తమ పని తాము చేస్తున్నా.. ఇంట్లోని వారికి అండగా ఉన్నానన్న భావన కలిగించేందుకు ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి. అలాంటి టైంలో ఆఫీసులో వర్కు ఇబ్బందికి గురి చేస్తుంటుంది.

మరి.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు డెడ్ లైన్ పరిమితులు ఉన్న వేళలో.. ఇంట్లోని వారు ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే పరిస్థితి వస్తే.. సదరు ఉద్యోగుల ఇబ్బంది ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సమస్యల్ని అర్థం చేసుకున్నట్లుగా.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వీలుగా యశోదా ఆసుపత్రితో పాటు కొన్ని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు సరికొత్త సేవల్ని షురూ చేశారు.

వర్కు స్టేషన్ ను తలపించేలా.. ఒక డెస్కు, ఇంటర్నెట్ కనెక్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఆసుపత్రిలో అయినోళ్లకు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వేళలోనే.. గదిలోనే ఆఫీసు పని చేసుకోవటానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. తాజా సదుపాయంతో ఐటీ ఉద్యోగులకు వరంగా మారిందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశారొకరు. ఇది కాస్తా వైరల్ గా మారింది. ఈ వసతి మిగిలిన ఆసుపత్రులకు పాకితే.. ఇంటినుంచి పని చేసే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి పెద్ద రిలీఫ్ గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News