రోజా అనుకున్నది సాధించారా ?
ఆ జంట ఎన్నికల్లో వైసీపీకి రోజాకీ వ్యతిరేకంగా పనిచేయడమే కాదు టీడీపీకి పూర్తిగా మద్దతు ఇచ్చారు.
నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా అనుకున్నది సాధించారు అని అంటున్నారు. ఆమెను నగరిలో సాఫీగా పనిచేసుకోనీయకుండా అయిదేళ్ళ పాటు ముప్ప తిప్పలు పెట్టిన జంటను వైసీపీని నుంచి పంపించవేయగలిగారు. ఆ జంట ఎన్నికల్లో వైసీపీకి రోజాకీ వ్యతిరేకంగా పనిచేయడమే కాదు టీడీపీకి పూర్తిగా మద్దతు ఇచ్చారు.
దాంతో రోజా దారుణమైన ఓటమి చవిచూసారు. ఇంతకీ ఆ జంట ఏవరంటే చిత్తూరు జిల్లా నగరి నియోజక వర్గానికి చెందిన రాష్ట్ర వైఎస్పార్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కేజే కుమార్, మునిసిపాలిటీ మాజీ చైర్ పర్సన్ కేజె శాంతి. ఈ ఇద్దరూ రోజాకు కంట్లో నలుసుగా మారారు. జగన్ నగరిలో ఒకసారి ముఖ్యమంత్రిగా నిర్వహించిన కార్యక్రమంలో రోజాను శాంతిని ఒక్కటిగా ఉండాలని చేయిగలిపారు.
అయితే జగన్ కలపాలని చూసినా కేజే శాంతి సుముఖత వ్యక్తం చేయలేదు. ఇటు రోజా కూడా అయిష్టంగా చేయి చాచి వెనక్కి తీసుకున్నారు. ఆ సంఘటనతోనే నగరిలో రోజాకు కష్టం అని తేలిపోయింది. దానిని నిజం చేసాయి తాజా ఫలితాలు. ఓడిన తరువాత మూడు నెలల పాటు రోజా నగరిలో లేరు, అలాగే వైసీపీలో కూడా సౌండ్ చేయలేదు. ఆమె లేటెస్ట్ గా జగన్ తో తాడేపల్లి నివాసంలో చిత్తూరు జిల్లా పార్టీ సమీక్షలో కనిపించారు.
అయితే ఆమె రావడం వెనక కారణాలు ఉన్నాయని అంటున్నారు. నగరిలో తాను సవ్యంగా పనిచేయాలంటే ఫ్రీ హ్యాండ్ ని ఆమె కోరుకున్నారని అంటున్నారు. అంతే కాకుండా పార్టీలో తన వ్యతిరేకులు ఎవరూ ఉండకూడదని ఆమె గట్టిగానే చెప్పారని అంటున్నారు.
ఆమె మాటకు వైసీపీ హై కమాండ్ ఆమోదం తెలిపింది. దంతో జేజే కుమార్ దంపతులను పార్టీస్ సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం ఆ వెంటనే వెలువడింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ భరత్ ప్రకటించారు.
అయితే ఈ ఇద్దరే కాదు మరికొందరు కీలక నేతలు కూడా రోజాను నగరిలో వ్యతిరేకిస్తున్నారు. వారు బలమైన నాయకులుగా ఉన్నారు. వారి మీద యాక్షన్ కి రోజా పట్టుబట్టినా చర్యలు లేవు అని అంటున్నారు. వారి విషయంలో చిత్తూరు జిల్లాలోని అగ్ర నేత అండ ఉండడం వల్లనే అలా జరిగింది అని ప్రచారం సాగుతోంది. అయిదేళ్ల పాటు నగరిలో వైసీపీని బలోపేతం చేయడంతో పాటు తిరిగి ఏపీలో చురుకుగా రోజా వ్యవహరించేలా అధినాయకత్వం ఈ డెసిషన్ తీసుకుంది అని అంటున్నారు. మరి ఆమె పూర్తి స్థాయిలో పార్టీ యాక్టివిటీస్ లోకి వస్తారా అన్నది చూడాల్సి ఉంది.