బీసీ గణన.. వైసీపీకి లాభమెంత..!
ఈ క్రమంలోనే ప్రజలను మరింత మచ్చిక చేసుకునేందుకు బీసీ గణనకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇది ఒకరకంగా.. వైసీపీ వేస్తున్న ద్విముఖ వ్యూహమని అంటున్న విశ్లేషకులు.
ఏపీ అధికార పార్టీ వైసీపీ వినూత్న కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యేను ప్రజల వద్దకు పంపించడం.. ప్రభుత్వ కార్యక్రమాలు వివరించడం.. ఒక ఎత్తయితే.. సీఎం జగన్ సహా.. మంత్రులు కూడా ప్రజల మధ్యకు వచ్చే కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం ద్వారా విభజిత ఏపీలో రికార్డు సృష్టించాలనేది వైసీపీ వ్యూహం.
ఈ క్రమంలోనే ప్రజలను మరింత మచ్చిక చేసుకునేందుకు బీసీ గణనకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇది ఒకరకంగా.. వైసీపీ వేస్తున్న ద్విముఖ వ్యూహమని అంటున్న విశ్లేషకులు. బీసీ సామాజిక వర్గాలు.. ఎప్పటి నుంచో గణనకు పట్టుబడుతున్నాయి. తమ తమ ఉప కులాల్లో వెనుక బడిన వర్గాలను గుర్తించి.. వారికి రిజర్వేషన్ అమలు చేయడంతోపాటు.. మరింతగా పథకాలు అందించాలనేది వారి డిమాండ్.
వాస్తవానికి ఎన్టీఆర్ హయాం నుంచికూడా ఈ డిమాండ్ ఉంది. బీసీలు వెన్నెముకగా చెప్పుకొనే టీడీపీపై అప్పట్లో ఒత్తిడి కూడా చేశారు. అయితే.. బీసీల గణన చేపడితే.. ఈ కులాల్లోనే ఉన్న ప్రధాన కులాలు.. ఆగ్రహించే అవకాశం ఉంటుందని.. తమకు రిజర్వేషన్ శాతం తగ్గుతుందనే వాదన కూడా ఉంది. దీంతో బీసీ గణన డిమాండ్ ఎన్టీఆర్ హయాం నుంచి రికార్డులు, ఫైళ్లు, వాదనలు, డిమాండ్లకే పరిమితం అయింది.
ఇక, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బీసీ గణనకు పచ్చ జెండా ఊపింది. ఈ నెల 27 నుంచి బీసీ గణనను చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వలంటీర్లను రంగంలోకి దింపనుంది. రాష్ట్రంలో బీసీలు ఎంత మంది ఉన్నారు..? వీరి వృత్తులు, ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితులు, వెనుక బడిన వారు.. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం ఇలా.. అన్ని కోణాల్లోనూ వైసీపీ నిర్దిష్టంగా సమాచారం సేకరించనుంది. అయితే.. ఇక్కడ వైసీపీకి లబ్ధి ఏంటి? అనేది ప్రశ్న.
వచ్చే ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకొనేందుకు.. మేనిఫెస్టోలో ఈ దఫా.. బీసీలకు పెద్ద పీట వేయాలని వైసీపీ భావిస్తున్నట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీని ఇరుకున పెట్టేలా.. బీసీల గణన ద్వారా.. వారికి లబ్ది చేకూర్చే పథకాలను వండి వార్చాలనేది వైసీపీ వ్యూహం. ఇది ఒకరకంగా.. వైసీపీకి మేలు చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. అయితే.. నాలుగున్నరేళ్లు ఆగి ఇప్పుడు చేపట్డం అంటే.. ఇది ఎన్నికల్లో బీసీల ఓట్లను వినియోగించుకునేందుకేనని విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తంగా.. వైసీపీ చేస్తున్న ఈ ప్రయత్నం ఫిఫ్టీ-ఫిఫ్టీగానే ప్రయోజనం చేకూర్చనుందని అంటున్నారు.