సిక్కోలు వైసీపీ అభ్యర్ధుల జాబితా జగన్ చేతుల్లో...?

దీన్ని బట్టి చూస్తే ఇప్పటిదాకా వైసీపీ నుంచి ఫలానా చోటున ఫలానా అభ్యర్ధి పోటీ చేస్తున్నారు అంటూ వచ్చిన వార్తలలో నిజం లేదని అంటున్నారు.

Update: 2023-11-07 04:13 GMT

ఉత్తరాంధ్రాలో పది అసెంబ్లీ సీట్లతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉంది. 2019లో ఈ జిల్లాలో పదికి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లను వైసీపీ గెలుచుకుని విజయఢంకా మోగించింది. అయితే ఈసారి అటువంటి పరిస్థితి ఉంటుందా అంటే వైసీపీ వేవ్ అండర్ కరెంట్ గా ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

ఇదిలా ఉంటే మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీ నియోజకవర్గం అయిన పలాసలో వైసీపీ నిర్వహించిన సామాజిక సాధికారిక బస్సు యాత్రలో భాగంగా సభకు జనం పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ సభకు జనాలు రావడం పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రజలకు అందుతున్న పధకాల ప్రభావమే ఇదంతా అని అంటున్నారు. ఇక పది అసెంబ్లీ సీట్లలో కొన్ని చోట్ల అభ్యర్ధులు ఖరారు అయ్యారని వస్తున్న వార్తలను కూడా పార్టీ నేతలు ఖండిస్తున్నారు. వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ ధర్మాన క్రిష్ణదాస్ దీని మీద మాట్లాడుతూ మొత్తం పదికి పది ఎమ్మెల్యే సీట్లను నిర్ణయించేది జగనే అన్నారు. ఆయన వద్దనే డేటా అంతా ఉందని చెప్పుకొచ్చారు.

అభ్యర్ధులు ఎవరు అన్నది అధినేతకు మాత్రమే తెలుసు అని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటిదాకా వైసీపీ నుంచి ఫలానా చోటున ఫలానా అభ్యర్ధి పోటీ చేస్తున్నారు అంటూ వచ్చిన వార్తలలో నిజం లేదని అంటున్నారు. మంత్రులు అయినా సీనియర్ నేతలు అయినా టికెట్ ఖరారు కాలేదని అంటున్నారు.

మొత్తం వడపోత పట్టి చివరికి ఎవరు అభ్యర్ధిగా ఉండాలన్నది జగనే నిర్ణయిస్తారు అని అంటున్నారు. జిల్లాలో చూస్తే ఇద్దరు మంత్రులు ఉన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రిగా క్రిష్ణ దాస్ పని చేసి ఉన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా కీలకంగా ఉన్నారు. అయితే వీరిలో ఎవరికీ టికెట్ గ్యారంటీ అయితే లేదని క్రిష్ణ దాస్ మాటలలో తెలుస్తోంది.

అసలు జగన్ ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. సీనియర్లను అయితే లోక్ సభకు లేకపోతే పార్టీ సేవలకు వాడుకుని టోటల్ గా యూత్ కి కొత్త ముఖాలకు సీట్లు ఇవ్వాలని అలాంటి ప్రయోగమే చేస్తే సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు అని అంటున్నారు.

అదే విధంగా బీసీ జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో వారికే పెద్ద పీట వేయడానికి చూస్తున్నారు అని అంటున్నారు. మహిళా కోటా కింద ఈసారి మూడు దాకా సీట్లు ఇవ్వవచ్చు అని అంటున్నారు. గతసారి రెండు సీట్లు ఇచ్చారు. ఇద్దరూ గెలిచారు. దాంతో మహిళా ప్రాతినిధ్యం పెంచాలని చూస్తున్నారు.

ఈ మొత్తం పరిణామాల నేపధ్యంలో ఎవరికి టికెట్ దక్కుతుంది అన్నది మాత్రం అంతుబట్టడంలేదు. మరో వైపు తెలుగుదేశంలో సగానికి పైగా సీట్లలో లిస్ట్ ఖరారు అయింది అని వార్తలు వస్తున్నాయి. మరి టీడీపీకి ధీటుగా అధికార వైసీపీ ఎంపిక చేస్తుందా లేక ప్రయోగాలు చేస్తుందా అన్నది చూడాలి. అంతా జగన్ చేతిలోనే అని దాసన్న తేల్చేశాక ఇక అందరి చూపూ హై కమాండ్ మీదనే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News