వైసీపీ టికెట్లు.. జెడ్పీలకు లక్కీ చాన్సు!

ఆంధ్రప్రదేశ్‌ లో మరో మూడు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Update: 2024-01-12 04:33 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో మరో మూడు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటివరకు మొత్తం 50 అసెంబ్లీ, 9 లోక్‌ సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు.

కాగా వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు జగన్‌ సీట్లు నిరాకరించారు. ఆయా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను రంగంలోకి దించారు. మరికొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్నవారిని వేరే నియోజకవర్గాలకు మార్చారు.

కాగా జగన్‌ చేసిన మార్పుల్లో ప్రస్తుతం జెడ్పీటీసీలుగా ఉన్నవారు ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలను దక్కించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీకాకుళం జిల్లా జెడ్పీ చైర్‌ పర్సన్‌ గా ఉన్న పిరియా విజయకు ఇచ్చాఫురం అసెంబ్లీ టికెట్‌ ను కేటాయించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పిరియా విజయ భర్త పిరియా సాయిరాజ్‌ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆయనకు సీటు ఇవ్వకుండా ఆయన భార్య, జెడ్పీ చైర్‌ పర్సన్‌ గా పిరియా విజయకు సీటు కేటాయించడం విశేషం.

అలాగే ప్రస్తుతం కడప జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గా ఉన్న ఆకేపాటి అమర్‌ నాథ్‌ రెడ్డిని రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆకేపాటి అమర్‌ నాథ్‌ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో వైసీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇక 2019లో వైసీపీ ఆయనకు సీటు ఇవ్వలేదు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఆకేపాటి అమర్‌ నాథ్‌ రెడ్డిని రాజంపేట అభ్యర్థిగా ప్రకటించింది.

అదేవిధంగా పిరియా విజయ, ఆకేపాటి అమర్‌ నాథ్‌ రెడ్డిల బాటలోనే మరో జెడ్పీటీసీ బూసినే విరూపాక్షికి కర్నూలు జిల్లా ఆలూరు సీటును కేటాయించారు. ప్రస్తుతం ఆలూరు ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాం ఉన్నారు. వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ లో గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే గుమ్మనూరు జయరాంను కర్నూలు లోక్‌ సభా అభ్యర్థిగా ప్రకటించారు. జయరాం స్థానంలో చిప్పగిరి జెడ్పీటీసీగా ఉన్న బూసినే విరూపాక్షికి ఆలూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు.

మొత్తం మీద ముగ్గురు జెడ్పీటీసీలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. మరి ఈ ముగ్గురిలో విజయం సాధించేది ఎవరో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News