పెందుర్తిలో వైసీపీ వర్సెస్ జనసేన...?
కాపు వర్సెస్ వెలమ అన్నట్లుగా ఉండే రాజకీయం లో వైసీపీ జనసేన పోరు కనుక సాగితే ఎవరు విజేత అన్నది చూడాల్సి ఉంది.
విశాఖ జిల్లాలో పెందుర్తి ఒక డిఫరెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఇది సిటీ లో ఉంటూనే రూరల్ వాతావరణం కలిగి ఉంటుంది. ఉమ్మడి జిల్లాగా విశాఖ ఉన్నపుడు కొన్ని దశాబ్దాల క్రితం అయితే పెందుర్తి అద్భుతమైన రాజకీయ కేంద్రం. రాజకీయ సమరాంగణ వేదిక. దిగ్గజ నేతలు ఇక్కడ నుంచి గెలిచారు. రాజకీయాలు చేశారు చాణక్య వ్యూహాలు పన్నారు.
ఉత్తరాంధ్రా జిల్లాల రాజకీయ యోధుడు ద్రోణంరాజు సత్యనారాయణ పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1978లో ఈ సీటు ఏర్పడినపుడు ప్రస్తుతం వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ తాత గుడివాడ అప్పన్న తొలిసారి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కుమారుడు, అమరనాధ్ తండ్రి గుడివాడ గురునాధరావు 1989లో పెందుర్తి నుంచి గెలిచి ఆ తరువాత కాలం లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా రెండేళ్ల పాటు పనిచేశారు.
ఇక పెందుర్తి ఎపుడూ కాంగ్రెస్ రాజకీయాల తో హాట్ హాట్ గా ఉండేది. ఇక్కడ కాపులు వెలమలు బీసీలు కూడా ఎక్కువ. 2009లో విభజన తరువాత ప్రజారాజ్యం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా అపుడే రాజకీయ అరంగేట్రం చేసిన పంచకర్ల రమేష్ బాబు గెలిచారు ఆ తరువాత ఆయన టీడీపీ లో చేరి ఎలమంచిలి నుంచి పోటీ చేసి 2014లో గెలిచారు. అదే ఎలమంచిలి నుంచి 2019లో పోటీ చేసి ఓడారు.
ఇక పంచకర్ల ప్రజారాజ్యం, కాంగ్రెస్ టీడీపీ వైసీపీల మీదుగా జనసేన లోకి వచ్చారు. ఆయన సెంటిమెంట్ సీటూ సెంటిమెంట్ పార్టీగా నాటి ప్రజారాజ్యానికి నవీన రూపం అయిన జనసేన నుంచి పెందుర్తిలో గెలవాల ని చూస్తున్నారు. అయితే 2014 నాటికి పదిహేనేళ్ళు అవుతాయి పంచకర్ల గెలిచి. ఆనాటి రాజకీయం ఇపుడు ఉందా అన్నది ఒక చర్చ.
ఇక వైసీపీకి యువ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ ఉన్నారు. ఆయన 2019 ఎన్నికల్లో దాదాపుగా లక్ష ఓట్లను తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో జనసేన కు 19 వేల ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీకి 70 వేల ఓట్ల పై చిలుకు దక్కాయి. ఇక 2014లోకి వెళ్తే టీడీపీకి 94 వేల ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైసీపీకి 75 వేల ఓట్లు వచ్చాయి. దాని కంటే ముందు 2009 ఎన్నికల కు వెళ్తే ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన పంచకర్లకు 51 వేలు వచ్చాయి. మెజారిటీ మూడు వేల పై చిలుకు వచ్చింది.
ఇక టీడీపీ తరఫున గెలిచిన బండారు సత్యనారాణమూర్తి 2014లో 18 వేల మెజారిటీ సాధిస్తే వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజు ఏకంగా 28 వేల ఓట్ల మెజారిటీ దక్కిచుకున్నారు. 1978లో ఏర్పాటు అయిన పెందుర్తిలో ఉప ఎన్నికతో కలుపుకుని మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నాలుగు సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ, పీయార్పీ, సీపీఐ ఒకసారి గెలిచాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వైసీపీకి షిఫ్ట్ అయిన నేపధ్యంలో అటు టీడీపీ ఇటు వైసీపీ ఢీ అంటే ఢీ కొడుతున్నాయి.
ఇపుడు ఈ సీటు ని పంచకర్ల రమేష్ బాబుకు జనసేన లో పొత్తులో భాగంగా టీడీపీ వదులుకుంటుందా అన్నది పెద్ద చర్చ. ఎందుకంటే బలంగా టీడీపీ ఉంది కాబట్టి. ఒకవేళ పట్టుబట్టి జనసేన తీసుకున్నా టీడీపీ ఎంతవరకూ సాయం చేస్తుంది అన్నది చూడాలి. మరో వైపు నాటి పట్టుకుని పంచకర్ల రమేష్ బాబు కొనసాగించగలరా అన్నది ఇంకో చర్చ. ఇక్కడ రాజకీయమే కాదు సామాజిక పోరు కూడా ఉంది. కాపు వర్సెస్ వెలమ అన్నట్లుగా ఉండే రాజకీయం లో వైసీపీ జనసేన పోరు కనుక సాగితే ఎవరు విజేత అన్నది చూడాల్సి ఉంది.