ఉమ్మడి విశాఖ జిల్లా : సోషల్ ఇంజనీరింగ్ లో వైసీపీ వర్సెస్ టీడీపీ...!?
ముందుగా చూసుకుంటే కాపులకు వైసీపీ ఈసారి పెద్ద పీట వేసింది అలాగే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది అని తెలుస్తోంది.;
ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అధికార వైసీపీ ఏనాడో అభ్యర్ధులను ప్రకటించింది. తాజాగా జనసేన ఉన్న ఒక్క పెండింగు సీటు ప్రకటించడంతో కూటమి లిస్ట్ కూడా పూర్తయింది. దీంతో ఏ పార్టీ ఎవరికి ఎన్ని సీట్లు ఇచ్చారు. ఇందులో మహిళా కోటా ఎంత అన్న చర్చ అయితే వస్తోంది.
ముందుగా చూసుకుంటే కాపులకు వైసీపీ ఈసారి పెద్ద పీట వేసింది అలాగే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది అని తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ సీట్లు మూడు ఎంపీ సీట్లు ఉంటే వైసీపీ కాపులకు నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది. భీమునిపట్నం, గాజువాక అనకాపల్లి, చోడవరం అసెంబ్లీ సీట్లు ఇచ్చింది.
అలాగే బీసీలలో చూస్తే వెలమలకు మూడు సీట్లు ఇచ్చింది. అవి పెందుర్తి, మాడుగుల, నర్శీపట్నం ఉన్నాయి. ఆ తరువాత వరసలో మత్స్యకారులకు ఒక సీటు విశాఖ సౌత్ ని గవరలకు ఒక సీటుగా విశాఖ పశ్చిమను కేటాయించింది. రాజులకు రెండు సీట్లు ఇచ్చింది. అవి విశాఖ నార్త్ కేకే రాజు, ఎలమంచిలి ఉన్నాయి. కమ్మకు ఒక సీటు ఇచ్చింది. అది విశాఖ తూర్పుగా ఉంది. ఇక రిజర్వుడు సీట్లలో పాయకరావుపేట ఎస్సీలకు పాడేరు అరకు ఎస్టీలకు కేటాయించింది. మహిళా కోటా చూసుకుంటే విశాఖ అరకు రెండు ఎంపీ సీట్లను మహిళలకు ఇచ్చింది. అలాగే మాడుగుల ఎమ్మెల్యే సీటుని మహిళలకు ఇచ్చింది. అలా వైసీపీ సోషల్ ఇంజనీరింగ్ చేసిది అని అంటున్నారు.
టీడీపీ జనసేన బీజేపీ కూటమి తీసుకుంటే విశాఖలో టీడీపీ మొత్తం 15 అసెంబ్లీ సీట్లలో తొమ్మిదికి పోటీ చేస్తోంది. అలాగే విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ పడుతోంది. టీడీపీ లిస్ట్ చూస్తే కాపులకు ఒకే సీటు ఇచ్చింది అది భీమిలీ సీటు, అలాగే వెలమలకు రెండు సీట్లు ఇచ్చింది అవి నర్శీపట్నం, మాడుగులగా ఉన్నాయి. రాజులకు ఒక సీటు ఇచ్చింది అది చోడవరంగా ఉంది. యాదవులకు ఒక సీటు ఇస్తే గవరలకు ఒక సీటు ఇచ్చింది. కమ్మలకు ఒక సీటుని విశాఖ తూర్పులో ఇచ్చింది. ఎస్సీలకు ఒక సీటు రిజర్వుడు నియోజకవర్గం కేటాయించింది. టీడీపీ ఒక్కటే సీటు మహిళకు ఇచ్చింది. అది వంగలపూడి అనితకు పాయకరావుపేట సీటుగా ఉంది. ఎస్టీకి పాడేరులో ఒక సీటు ఇచ్చింది.
జనసేనకు నాలుగు సీట్లు ఇస్తే అందులో రెండు కాపులకు ఇచ్చింది. అవి పెందుర్తి, ఎలమంచిలి. రెండు బీసీలకు ఇచ్చింది. విశాఖ సౌత్ లో యాదవులకు అనకాపల్లిలో గవరలకు జనసేన సీట్లు ఇచ్చింది. బీజేపీకి రెండు సీట్లు ఇస్తే విశాఖ నార్త్ లో రాజులకు సెఏటు ఇచ్చింది. అరకు లో మరో సీటు ఎస్టీలకు ఇచ్చింది.
ఈ మొత్తంలో చూసుకుంటే కాపులకు వెలమలకు పెద్ద పీట వైసీపీ వేసింది అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే మహిళలకు ఎక్కువ సీట్లు తామే ఇచ్చామని చెబుతున్నారు. కాపులకు నాలుగు అసెంబ్లీ సీటు, బీసీలకు రెండు ఎంపీ సీట్లతో పాటు అయిదు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చామని వైసీపీ అంటోంది.
ఇక టీడీపీ కూటమి విషయానికి వస్తే మూడు అసెంబ్లీ సీట్లు కాపులకు ఇచ్చారు, బీసీలకు ఆరు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. రిజర్వుడు ఎంపీ సీటు అరకుని పక్కన పెడితే మిగిలిన రెండూ ఎంపీ సీట్లూ ఓసీలకే కూటమి ఇచ్చింది అని అంటున్నారు. వైసీపీ ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్యేకు చాన్స్ ఇస్తే కూటమి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేకు చాన్స్ ఇచ్చింది. ఈ లెక్కలతో ఇపుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ ముందుకు వెళ్తోంది. తాము కాపులకు బీసీలకు ఇతర వర్గాలకు పెద్ద పీట వేశామని మహిళలకు కూడా చాన్స్ ఇచ్చామని చెబుతోంది. మరి దీనిని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.