హైదరాబాద్ ఏఎంబీ మాల్ లో బౌన్సర్లతో యూట్యూబర్ అతి

తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నమే చేశాడు. ఇతగాడి అతి చేష్టలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Update: 2024-12-29 09:30 GMT

‘బౌన్సర్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. హద్దులు దాటితే వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అంటూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ ఆనంద్ వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. అతి బిల్డప్ ఇచ్చేందుకు బౌన్సర్లను చుట్టూ వేసుకొని హడావుడి చేసే బ్యాచ్ ఉంటుంది. ఇలాంటి వారికి సేవలు అందించే బౌన్సర్ల తాట తీయాల్సిన అవసరం ఉందన్న విషయం తాజా ఎపిసోడ్ ను చూస్తే అర్థమవుతుంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ఇటీవల కాలంలో సినీ తారలు.. సెలబ్రిటీలకు తోడుగా చిన్నసైజు సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్ల హడావుడి ఎక్కువైంది. వారి బాటలోనే యూట్యూబర్లు కూడా. కొందరు తమ ఇమేజ్ ను పెంచుకోవటానికి.. సోషల్ మీడియాలో మరింత ఫేమస కావటానికి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఇందుకోసం అడ్డదారులు తొక్కుతున్నారు. హైదరాబాద్ కు చెందిన ఒకడు తన ఇన్ స్టా ఫాలోవర్స్ ను పెంచుకోవటానికి వీలుగా ఒక ఎత్తు వేశాడు.

కొండాపూర్ లోని శరత్ సిటీ మాల్ కు బౌన్సర్లతో వెళ్లాడు. ఏఎంబీ మాల్ లోని రెండో అంతస్తుకు వస్తే వారికి డబ్బులు ఇస్తానని పేర్కొంటూ.. సూట్ కేసులతో మాల్ వద్ద హడావుడి చేశాడు. అయితే.. అతన్ని అక్కడి ప్రైవేటు సెక్యురిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఇలాంటి వాటిని తాము అనుమతించమని చెప్పటంతో.. మరేం చేయలేక వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ హడావుడి చేసినోడ్ని వంశీగా గుర్తించారు. గతంలోనూ సోషల్ మీడియాలో ఫేమస్ కావటానికి వీలుగా కేపీహెచ్ బీలోనూ హడావుడి చేయటంతో.. అక్కడి పోలీసులు అతడి మీద కేసు బుక్ చేశారు. తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నమే చేశాడు. ఇతగాడి అతి చేష్టలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఉదంతంపై తాము ఎలాంటి కేసు నమోదు చేయలేదని గచ్చిబౌలి పోలీసులు చెబుతున్నారు. కాకుంటే.. వైరల్ వీడియోల పుణ్యమా అని అతడిపై కేసు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News