షర్మిలకు తత్వం బోధపడిందా ?
ఈ క్రమంలో షర్మిల పార్టీని పట్టించుకోవడం లేదు అన్నది సీనియర్ల మాటగా ఉందిట. అదే ఫిర్యాదుగా కూడా మారుతోంది అని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఏపీ మీద పెద్దగా ఆశలు అయితే లేవు. ఉమ్మడి ఏపీ విభజన తరువాత కూడా తెలంగాణాలో తమకు రాజకీయ లాభం కలుగుతుందనే ఆ పార్టీ పెద్దలు భావించారు. ఆ తరువాత మెల్లగా ఏపీలోనూ నచ్చచెప్పుకోవచ్చు అని తలచారు. కానీ చూస్తే జరిగినది వేరు.
తెలంగాణాను ఇచ్చిన చోటనే కాంగ్రెస్ ని పదేళ్ల పాటు జనాలు నమ్మలేదు. అక్కడ గత ఏడాది మాత్రమే అధికారం అప్పగించారు. మరి తమకు ఇష్టం లేకుండా అడ్డగోలు విభజన చేశారు అని మండిపోతున్న ఏపీ జనాలు కాంగ్రెస్ ని నమ్మాలీ అంటే మరో పదేళ్ళు పట్టేట్లుగా ఉంది అన్నది నిజం.
అందుకే కాంగ్రెస్ పెద్దలు ఏపీ విషయంలో పెద్దగా హైరానా అయితే పడడం లేదు. పీసీసీ చీఫ్ ల విషయంలోనూ వారు నియామకాలు చేస్తున్నారు. కానీ వారి పనితీరుతో అద్భుతాలు అయితే జరిగిపోతాయన్న భ్రమలు అయితే లేవనే అంటున్నారు.
అయితే ఏపీలో కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మకంగానే వైఎస్ షర్మిలను తెచ్చిపెట్టింది. వైసీపీ కాంగ్రెస్ ఓట్లను తీసుకుని పోయింది కాబట్టి అదే వైఎస్సార్ రక్తం అయిన షర్మిలను తెస్తే కాంగ్రెస్ కి కొంత అయినా ఊపిరి అందుతుందని భావించింది. అయితే ఆ ప్రయోగం కూడా అంతగా సక్సెస్ కాలేదని 2024 ఎన్నికలు నిరూపించాయి. షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టినా కూడా కాంగ్రెస్ ఓటు శాతం ఏమీ పెద్దగా పెరగలేదు. పైగా ఒక్క సీటు కూడా దక్కలేదు.
దాంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఏపీ విషయంలో ఏమి చేయాలన్న అన్న దగ్గరే ఆగిపోతోంది. మరో వైపు చూస్తే వైసీపీతో పొత్తు పెట్టుకుని ఇండియా కూటమిలోకి ఆహ్వానించాలన్న దాని మీద చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ మీద ఎన్నికల ముందు గట్టిగా విరుచుకుపడిన షర్మిల ఎన్నికల తరువాత కూడా అదే విధానం అనుసరిస్తున్నారు.
ఇపుడు టీడీపీ కూటమి మీద పోరాటం చేయాలి. కానీ దానిని పక్కన పెట్టి సొంత అజెండా బయటకు తీస్తున్నారు అన్నది ఆ పార్టీలోనే చర్చగా ఉంది. ఈ క్రమంలో షర్మిల పార్టీని పట్టించుకోవడం లేదు అన్నది సీనియర్ల మాటగా ఉందిట. అదే ఫిర్యాదుగా కూడా మారుతోంది అని అంటున్నారు.
దీంతో జాగ్రత్తపడిన షర్మిల ఇపుడు పార్టీ కార్యక్రమాల జోరు పెంచారు. మూడు రోజుల పాటు ఆమె విజయవాడలో విద్యుత్ చార్జీల పెంపు మీద ఆందోళన చేపట్టారు. ఇక దీని తరువాత వరసబెట్టి ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పార్టీ ఇంచార్జిలను నియమిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో కొందరిని నియమిస్తే మలి విడతలో మరో యాభై మందిని నియమించారు. మూడవ విడతలో కూడా మిగిలిన నియోజకవర్గాలను కవర్ చేస్తామని చెబుతున్నారు.
ఈ విధంగా చూస్తే కనుక పార్టీని పటిష్టం చేయడం కోసం ఆమె తన వంతుగా అడుగులు మెల్లగా వేస్తున్నారు అయితే ఇది ఇక్కడితో సరిపోదు, మరిన్ని ఉద్యమాలు చేయాలి. టీడీపీ కూటమి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో పోరాటాలు చేయాలి. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఏపీ విషయంలో ఏ ఆలోచనలతో ఉందో దానిని అర్ధం చేసుకుని ఆ విధంగా ముందుకు సాగాలి.
మొత్తానికి చూస్తే షర్మిల తీసుకుంటున్న ఈ చర్యల వల్ల ఆమె పదవికి అయితే ఇప్పట్లో ముప్పు లేదనే అంటున్నారు. ఇప్పటికిపుడు ఆమెని తప్పించినా కొత్త వారిని తెచ్చినా కాంగ్రెస్ కి ఒరిగేది అయితే లేదు అన్నది వాస్తవం అని అంటున్నారు. అయితే నిజంగా వైసీపీ ఇండియా కూటమికి దగ్గరైతే మాత్రం అపుడు జగన్ కోరుకున్న వారినే కాంగ్రెస్ ఏపీ సారధిగా నియమించి రెండు పార్టీల మధ్య సయోధ్యకు బాటలు వేసేందుకు ప్రయత్నిస్తారు అని అంటున్నారు. సో వ్యవహారం అందాక రానందువల్ల షర్మిలతోనే కధ నడిపిస్తారు అని అంటున్నారు.