ద్వితీయ గండం దాటితే జగన్ కి సూపర్ సక్సెస్...!

రాజకీయాల్లో ద్వితీయ గండం ఒకటి ఉంటుంది. దాన్ని సక్సెస్ ఫుల్ గా దాటితే స్థిరం వస్తుంది. అలా రాజకీయాలలో కూడా సక్సెస్ రేటు పెరుగుతుంది.

Update: 2023-11-04 10:30 GMT

రాజకీయాల్లో ద్వితీయ గండం ఒకటి ఉంటుంది. దాన్ని సక్సెస్ ఫుల్ గా దాటితే స్థిరం వస్తుంది. అలా రాజకీయాలలో కూడా సక్సెస్ రేటు పెరుగుతుంది. తొలి విజయానికి సార్ధకత సమకూరుతుంది. దేశంలో రెండు సార్లు వరసగా లోక్ సభ ఎన్నికల్లో గెలిచి నరేంద్ర మోడీ తన సత్తా చాటుకున్నారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో తీసుకుంటే ప్రాంతీయ పార్టీల అధినేతలలో అప్పట్లో ఎన్టీయార్ మాత్రమే ద్వితీయ గండాన్ని దాటి ముందుకు వెళ్లారు. ఇక ఆయన అల్లుడిగా టీడీపీ అధినేతగా నరా చంద్రబాబు పగ్గాలు తీసుకున్నా ఎపుడూ ద్వితీయ గండం ఆన దాటలేక ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

చంద్రబాబు ఎన్టీయార్ సాధించిన అధికారాన్ని 1995లో తాను తీసుకున్నారు. ఇక తాను సొంతంగా 1999లో పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. దాన్ని ఆయన 2004 ఎన్నికల్లో కొనసాగించలేకపోయారు. అలా ఆయన ద్వితీయ గండం నుంచి తప్పించుకోలేకపోయారు

అంతే కాదు రెండు సార్లు ఉమ్మడి ఏపీలో ఓటమిని కూడా చవిచూశారు. ఇక 2014లో విభజన ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆయన అయిదేళ్ళ పాటు పాలించి 2019లో ఎన్నికలకు వెళ్తే ఇంకోసారి ద్వితీయ గండం వెక్కిరించి. అలా బాబు తన రాజకీయ జీవితంలో కీలక దశలో ఉన్నపుడు కూడా ఈ గండం నుంచి తప్పించుకోలేకపోయారు.

అదే ఉమ్మడి ఏపీ రెండుగా విభజించాక తెలంగాణాలో కేసీయార్ 2014లో తొలిసారి గెలిచారు. ఆయన 2018లో రెండవసారి గెలిచి ద్వితీయ గండాన్ని అధిగమించి అద్వితీయంగా రెండవసారి సీఎం అయిపోయారు. మూడవసారి సీఎం కావడం కోసం ఇపుడు కేసీయార్ ఆయన బృందం కొత్త ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతోంది. ఈ విషయంలో కూడా కేసీయార్ సక్సెస్ అయితే ఇక తిరుగులేనట్లే. అంతే కాదు సౌతిండియాలోనే వరసబెట్టి మూడుసార్లు సీఎం అయిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.

ఇక ఏపీలో చూసుకుంటే 2019లో తొలిసారి సీఎం అయిన వైఎస్ జగన్ 2024 ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఆయన కళ్ళ ముందు ఇపుడు ద్వితీయ గండం ఉంది. ద్వితీయ గండాన్ని జగన్ ఎలా దాటుతారు అన్నదే 2024 ఎన్నికల్లో ఆసక్తిని కలిగించే మరో అంశంగా ఉండబోతోంది. ఇక వైఎస్సార్ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఆయన ప్రాంతీయ పార్టీ అధినేత కాకపోయినా కాంగ్రెస్ లో ఉంటూ ఉమ్మడి ఏపీ వరకూ ఒక ప్రాంతీయ పార్టీ అధినాయకుడిగానే కాంగ్రెస్ ని నడిపారు.

అలా వైఎస్ నాయకత్వంలో 2004లో కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. రెండవసారి 2009లోనూ వచ్చింది. అంటే వైఎస్సార్ తిరుగులేని ప్రజా నాయకుడిగా మారి ఎన్టీయార్ కు ధీటైన నేతగా తెలుగు రాజకీయాల్లో రుజువు చేసుకున్నారన్న మాట. ఇక ఆయన కుమారుడిగా ఎన్నో రాజకీయ విజయాలను సాధించిన జగన్ కూడా ఈ అరుదైన ఫీట్ ని సునాయాసంగానే సాధిస్తారు అని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు.

నూటికి డెబ్బై నుంచి ఎనభై శాతం ప్రజానీకం మరోసారి వైసీపీని అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు అని అంటున్నారు. 2019 నుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ మధ్య వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు తప్ప అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ విజయభేరీ మోగించింది అని అంటున్నారు.

అదే విజయపరంపర 2024 ఎన్నికల్లోనూ జరిగి తీరుతుందని వైసీపీ నేతల దృఢ విశ్వాసం. ఇక జగన్ వరకూ చూసుకుంటే ఆయన 151 వద్ద ఆగిపోవడం లేదు, వై నాట్ 175 అని నినదిస్తున్నారు. ఈ విధంగా మొత్తానికి మొత్తం సీట్లను గెలుచుకుని స్వీప్ చేయాలన్నది జగన్ పట్టుదలగా ఉంది.

ఇక్కడ మరి కొన్ని విషయాల గురించి చెప్పుకోవాలి. రాజకీయ వాతావరణం చూస్తే టీడీపీ జనసేన కూటమి కట్టింది. ఇది బలమైన కూటమిగానే ఉంది. ఈ రెండు పార్టీలు కలిస్తే విన్నింగ్ చాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అయితే పొత్తులు కొన్ని సార్లు వికటించే అవకాశాలు ఉన్నాయి. పైగా తమది నెగిటివ్ ఓట్ ఫ్యాక్టర్ కాదు పాజిటివ్ ఓటు ఫ్యాక్టర్ అని వైసీపీ అంటోంది. అలా తన పాజిటివ్ ఓటు తమతోనే అని చెబుతోంది.

ఇక జాతకాల పరంగా చూసుకుంటే జగన్ జాతకం బాగా ఉందని 2024లో ఆయన మళ్లీ గెలిచి తీరుతారు అని మెజారిటీ ఆధ్యాత్మిక పరులు చెబుతున్నారు. జగన్ జాతకంలో మాజీ సీఎం అన్న మాట ఉండదని ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం ఇదే జరుగుతుందని అంటున్న వారూ ఉన్నారు. సామాజిక అంశాలు తీసుకుంటే ఏపీలోని మూడు ప్రధాన సామాజిక వర్గాలలో కాపులు కమ్మలు రెడ్లు లీడ్ చేసే స్థితిలో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎవరికి ప్లస్ అవుతారో చూడాల్సి ఉంది. వన్ ప్లస్ వస్ టూ అన్నది పొలిటికల్ మ్యాథమెటిక్స్ కాదని అంటున్నారు. సో వైసీపీ ధీమా వెనక ఈ రీజన్ కూడా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News