జగన్ బ్యాలెన్స్ చేస్తున్నారా ?

చట్టసభల్లో నియమాకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి సామాజికవర్గాలను బ్యాలెన్స్ చేస్తున్నట్లే ఉన్నారు

Update: 2023-08-11 05:12 GMT

చట్టసభల్లో నియమాకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి సామాజికవర్గాలను బ్యాలెన్స్ చేస్తున్నట్లే ఉన్నారు. తాజాగా నియమించిన ఇద్దరు ఎంఎల్సీల సామాజికవర్గాలను చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. గవర్నర్ కోటాలో కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీలను ఎంఎల్సీలుగా నియమించటం ఇందులో భాగమే. కుంభా విజయనగరం జిల్లాలోని ఎస్టీ సామాజికవర్గానికి చెందిన నేత. గతంలో ఎస్ కోట నియోజకవర్గంలో ఎంఎల్ఏగా కూడా పనిచేశారు. 2019 నుండి అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జిగా పనిచేస్తున్నారు.

ప్రొఫెసర్ గా పనిచేసిన రవిబాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాయకత్వంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటినుండి పూర్తిస్ధాయి రాజకీయాల్లోనే కంటిన్యు అవుతున్నారు. ఇక కర్రి పద్మశ్రీ కాకినాడ జిల్లాకు చెందిన నేత. మత్స్యకార సామాజికవర్గంలోని వాడ బలిజ ఉప సామాజికవర్గానికి చెందిన పద్మశ్రీ మత్స్యకార సంఘాల్లో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. శాసనమండలి సభ్యురాలు అవటం మొదటిసారే అయినా రాజకీయాలకు అయితే కొత్తకాదు.

పార్టీ ఆవిర్భావం నుండి వైసీపీలోనే పనిచేస్తున్నారు. ఈనెల 20వ తేదీన ప్రస్తుతం ఎంఎల్సీలుగా ఉన్న చదిపిరాళ్ళ శివనాధరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ పదవీకాలం అయిపోతోంది. వీళ్ళిద్దరు టీడీపీ నేతలు. ఖాళీ అవుతున్న రెండు స్ధానాల్లో జగన్మోహన్ రెడ్డి పై ఇద్దరిని ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదముద్రవేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అవకాశం వచ్చిన రెండు స్ధానాలను కూడా జగన్ ఒక ఎస్టీ, మరో బీసీలకు కేటాయించారు. అందులోను ఒక మహిళను ఎంపికచేశారు.

ఏ పార్టీ అయినా ప్రస్తుత రాజకీయాలను సామాజిక వర్గాల కోణంలోనే చేస్తున్నది. ఇందుకు జగన్ ఏమీ మినహాయింపు కాదు. కాకపోతే సోషల్ ఇంజనీరింగ్ పేరుతో జరిపే సామాజికవర్గాల సమతూకాన్ని పక్కాగా పాటిస్తున్నారంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి సోషల్ ఇంజనీరింగును జగన్ వ్యూహాత్మకంగా పాటిస్తున్నారు. ఎంఎల్సీలు కావచ్చు లేదా రాజ్యసభకు కూడా కావచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి వర్గాలు, మహిళలకే అధిక ప్రాధాన్యతిస్తున్నారు. రాజకీయనేతలు ఏదిచేసినా భవిష్యత్తులో జరగబోయే లబ్దిని దృష్టిలో పెట్టుకునే చేస్తారనటంలో సందేహంలేదు. కాకపోతే చేసే ప్రయత్నాలు ఎంత చిత్తశుద్దితో చేస్తున్నారన్నదానిపైనే వాళ్ళ ప్రయత్నాలకు ఫలితం అందుతుంది.

Tags:    

Similar News