ఇది జగన్ ప్రతీకారమే...ముఖ్యమంత్రి చంద్రబాబే !

ఈ కేసులో ఏ ఒక్క ఆధారమూ లేదని, రిమాండ్ రిపోర్టులో సైతం సీఐడీ దానిని నిరూపించలేకపోయిందని ఆయన అన్నారు

Update: 2023-09-13 08:52 GMT

జగన్ రాజకీయ ప్రతీకారంతోనే తన తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు మీద కేసులు పెట్టారని జైలుకు పంపారని ఆయన తనయుడు టీడీపీ నేత నారా లోకేష్ అంటున్నారు. ఒక ఆంగ్ల మీడియాకు ఆయన లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. చంద్రబాబు మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కుంభకోణం కేసు అంతా రాజకీయ దురుద్దేశ్యంతో కూడుకున్నదని కొట్టిపారేశారు.

ఈ కేసులో ఏ ఒక్క ఆధారమూ లేదని, రిమాండ్ రిపోర్టులో సైతం సీఐడీ దానిని నిరూపించలేకపోయిందని ఆయన అన్నారు. దేశంలో ఆరు రాష్ట్రాలలో ఈ ప్రాజెక్ట్ అమలు చేసిన తరువాతనే తాము ఏపీలో అమలు చేశామని చెప్పారు. పైగా 2013లో అప్పటి గుజరాత్ సీఎం అయిన నరేంద్ర మోడీ కూడా ఈ ప్రాజెక్ట్ ని అమలు చేశారని గుర్తు చేశారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా తన కుటుంబానికి ఒక్క పైసా కూడా లాభం రాలేదని అది ఎక్కడా రుజువు కాలేదని లోకేష్ స్పష్టం చేశారు. జగన్ మీద 36 కేసులు ఉన్నాయని, అందులో సీబీఐ నుంచి పది కేసులు, ఈడీ నుంచి మరో ఎనిమిది కేసులు ఉంటే ఇతర కేసులు కూడా ఉన్నాయని అన్నారు.

మరో వైపు చూస్తే జగన్ కేసులలో డాక్యుమెంట్ ఎవిడెన్స్ కచ్చితంగా ఉందని, ఆయన కంపెనీలలోకి డబ్బు నేరుగా వచ్చి చేరిందని కూడా ఆధారాలు ఉన్నాయని అన్నారు. జగన్ మీడియా హౌజ్ తో పాటు పవర్ ప్రాజెక్టులు ఇతర వ్యాపారాలు అన్నీ కూడా చేయడం వెనక ఈ సొమ్ము ఉందని కూడా లోకేష్ చెప్పుకొచ్చారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసు తీసుకుంటే 2021లో ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపారని, రెండేళ్ల పాటు జరిగిన విచారణలో ఏమీ తేలలేదని అన్నారు. చంద్రబాబు కంటే ముందు 36 మంది మీద కేసు కట్టి విచారించారని ఐటీ ఈడీ రంగంలోకి దిగినా ఈ కేసులో ఏమీ లేదని తేలిందని వివరించారు

తాను జైలులో ఉన్నాను కాబట్టి ఇతరులను ఇరికించడానికే జగన్ ఈ విషయంలో చంద్రబాబుని అరెస్ట్ చేశారని, ఇది పూర్తిగా ప్రతీకార రాజకీయమే అని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు ఇలా గొడవపడుతూ ఉంటే కేంద్రంలోని బీజేపీ చాలా జాగ్రత్తగా సైలెంట్ గా ఇవన్నీ చూస్తోందని దీని మీద మీరేమంటారు అని ప్రశ్నించగా బీజేపీ విషయంలో మాత్రం లోకేష్ సూటిగా మాట్లాడకపోవడం విశేషం. జగన్ దే తప్పు అన్నట్లుగానే ఆయన జవాబు ఇచ్చారు

అదే విధంగా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయి తీరుతారు అని కూడా లోకేష్ ధీమాగా చెప్పడం విశేషం. మొత్తానికి జగన్ ప్రతీకార రాజకీయమే ఇదంతా అని లోకేష్ చెబుతున్నారు. వచ్చేది తామే అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News