జగన్ కి తత్వం బోధపడుతోందా ?
ఈ నేపధ్యంలో పార్టీలో సీనియర్ నేతల తీరు వైసీపీ హై కమాండ్ కి ఏ మాత్రం మింగుడు పడడం లేదని అంటున్నారు.
రాజకీయం అంటే రాజకీయమే. దానిని అలాగే చేయాలి. అంతే తప్ప సొంత ఈక్వేషన్స్ వేరే ఆలోచనలు పెట్టుకుని రాజకీయ ఆటను తమకు నచ్చినట్లుగా మార్చుకోకూడదు. ఈ విషయం అర్ధం అయ్యేసరికి వైసీపీకి అధికారం ఆమడ దూరానికి పోయింది. ఇక గెలుపు పిలుపు ఏనాటికి అయినా అందుతుందా అన్నట్లుగా ఘోరమైన పరాజయం పలకరించింది
ఈ నేపధ్యంలో పార్టీలో సీనియర్ నేతల తీరు వైసీపీ హై కమాండ్ కి ఏ మాత్రం మింగుడు పడడం లేదని అంటున్నారు. చాలా మంది నేతలను గౌరవించి తగిన స్థానాలు ఇచ్చినా కూడా ఓటమి తరువాత వారు పత్తా లేకుండా పోయారు అన్న ఆవేదన అయితే అధినాయకత్వం లో ఉంది.
సామాజిక సమీకరణలు అని పేరు చెప్పి తానే తెచ్చిన సోషల్ ఇంజనీరింగ్ అంటూ అనేక మందికి కీలక పదవులు అప్పగించారు. అయితే వారు అంతా ఇపుడు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు అని అంటున్నారు. కొందరు సీనియర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. వారు ఎవరికి చెప్పినా టికెట్లు ఇచ్చారు.
మరి కొందరు మంత్రి పదవి తొలి విడతలో రాలేదు అని అలిగితే మలి విడతలో సర్దారు. వారు చెప్పినట్లుగా చేసినా కూడా ఈ రోజు మాత్రం పిలుపునకు దొరకనంత దూరంగా వారు ఉన్నారు. సీనియర్లను నమ్ముకుంటే ఇంతేనా అన్నది జగన్ కి ఇపుడు అర్థం అవుతోంది అని అంటున్నారు.
సీనియర్లు అంటేనే రాజకీయం బాగా చూసిన వారు. వారికి ఒక ఆప్షన్ కాకపోతే మరో ఆప్షన్ ఉంటుంది. అందుకే వారు వేరే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. పెద్ద నాయకులు అని ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారిని తెచ్చి గౌరవించిన ఫలితం కనిపిస్తోంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే సీనియర్లు ఇపుడు ఈ క్లిష్ట సమయంలో బయటకు వచ్చి పోరాడలేరు అని కూడా అంటున్నారు.
వారికి అన్ని లెక్కలూ తెలుసు. అందుకే వారు దూరంగానే ఉంటారు అని అంటున్నారు. జగన్ యువ నేతగా ఉన్నారు. పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. తెలుగుదేశంలో కూడా ఇదే రకమైన మార్పు జరుగుతోంది అని అంటున్నారు. చంద్రబాబు సీనియర్లను పక్కన పెట్టి తన మంత్రివర్గాన్ని ఈసారి కొత్తగా రూపొందించారు.
గతంలో అధికారంలోకి వచ్చిన ప్రతీ సారీ సీనియర్లకే పెద్ద పీట వేశారు. అయితే 2019 తరువాత పార్టీ ఓడి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మాత్రం సీనియర్లు చాలా మంది గుమ్మం దిగలేదు. పోరాటాలు చేయలేదు. దాంతో బాబుకు ఆనాడే తెలిసి వచ్చింది.
బాబుని చూసి అయినా జగన్ సర్దుకోలేకపోయారు అని అంటున్నారు. అంతే కాదు బీఆర్ఎస్ లోనూ వలస పక్షులు అన్నీ వేరే గూటికి వెళ్లిపోతున్నాయి. అందుకే పార్టీ ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి. విధేయతకు అగ్ర తాంబూలం ఇవ్వాలి. పార్టీ పట్ల విశ్వాసం ఉన్న వారినే చేరదీయాలని అంటున్నారు.
వైసీపీలో ఇపుడు దాని మీదనే చర్చ సాగుతోంది అని అంటున్నారు. మొత్తం ఏపీలోని ఇరవై ఆరు జిల్లాలలో ముగ్గురు నలుగురు తప్ప సీనియర్లు ఎవరూ పెదవి విప్పడంలేదు, ముఖం క నిపించనీయడం లేదు అని అంటున్నారు. జగన్ తాడేపల్లి లో ఉన్నా కూడా చాలా మంది నేతలు కలుసుకునేందుకు కూడా రాకపోవడంతో తత్వం బోధపడుతోంది అని అంటున్నారు. అధికారాంతమున తనవారు ఎవరో పరవారు ఎవరో తెలిసివచ్చిందని అంటున్నారు. మరి దీని నుంచి నేర్చుకున్న పాఠాలతో వైసీపీని ఎలా నూతనంగా జగన్ నిర్మిస్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.