ప్రధాన ప్రతిపక్షం సరే.. 2014 మాటేంటి జగన్.. ?
తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి.. తాము అసెంబ్లీకి వెళ్లేది లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చెబుతున్నారు.;

తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి.. తాము అసెంబ్లీకి వెళ్లేది లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చెబుతున్నారు. దీనిపై ఇటు అధికార పక్షం కూడా అంతే స్థాయిలో వ్యాఖ్యలు చేస్తోంది. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తాము ఇవ్వలేమని చెబుతోంది. ఈ క్రమంలోనే 10 పర్సంట్ సీట్ల వ్యవహారాన్ని లేవనెత్తుతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు వచ్చా యని.. కాబట్టి మొత్తం 175 మందిలో కనీసం 18 స్థానాలైనా ఉంటే అప్పుడు ఒకరు ఇచ్చేది ఏమిటి.. ప్రజలు ఇచ్చినట్టేనని ప్రభు త్వం చెబుతోంది. ఈ వ్యవహారంతో వైసీపీ సభకు రాకుండా పోయింది.
ప్రస్తుతం దీనిపై కోర్టులో పిటిషన్ విచారణలో ఉంది. మరోవైపు.. ఇప్పటికి మూడు సభలు జరిగాయి. వీటిలో ఒక్కదానికి కూడా పూర్తిస్థాయిలో వైసీపీ సభ్యులు రాలేదు. పైగా వారు దొంగచాటుగా వచ్చి వెళ్తున్నారని.. అటెండెన్సు పుస్తకంలో సంతకాలు చేస్తున్నారని.. ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. ప్రతిపక్ష హోదాను తాము ఇచ్చేది లేదన్నారు. దీంతో వైసీపీ వచ్చే నాలుగేళ్లపాటు కూడా సభకు వచ్చే పరిస్థితి లేదన్నది స్పష్టం. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీ నాయకులకు,ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి సెగ తగులుతోంది.
ఓట్లు వేసి గెలిపించిన తమకు మీరు ఏం న్యాయం చేస్తున్నారని ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. కట్ చేస్తే.. దీనిపై వైసీపీ సోషల్ మీడియాలో కూటమి సర్కారును టార్గెట్ చేస్తోంది. సర్కారు అనుసరిస్తున్న రాజకీయ వైఖరి వల్లే తాము సభకు రావడం లేదని.. తీవ్ర విమర్శలు చేస్తూ.. పోస్టులు పెడుతోంది. ప్రభుత్వం తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే.. తప్పకుండా సభకు వెళ్తామని కూడా వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ, ఇది ఎంత వరకు వాస్తవం? అనేది ప్రశ్న. ఎందుకంటే.. వైసీపీ ఇప్పుడే కాదు 2014 ఎన్నికల్లో కూడా ఓటమి చవిచూసింది.
అప్పట్లో వైసీపీకి 67 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. అంటే.. ఒకరకంగా ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రజలే ఇచ్చారు. మరి అప్పట్లో పూర్తి కాలం సభకు వెళ్లారా? సభలో ప్రజల సమస్యలపై ప్రశ్నించారా? అంటే లేదనే చెప్పాలి. సభ ఇంకా.. మూడు సంవత్సరాల పాటు ఉంటుందని అనగా.. 2017 ప్రారంభంలోనే జగన్ సభను బాయికాట్ చేశారు. తన వారిని కూడా సభకు వెళ్లకుండా అడ్డుకున్నా రు. ఇలా 2019లో అప్పటి ప్రభుత్వ కాల పరిమితి పూర్తయ్యే వరకు ఆయన అలానే వ్యవహరించారు. సో.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి సభకు వెళ్లడం లేదని అంటున్న వైసీపీ.. అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండి కూడా.. ఎందుకు వెళ్లలేదంటే.. వైసీపీ నేతల వద్ద సమాధానం లేదు. ఏదేమైనా.. అధికారం ఉంటే తప్ప.. వైసీపీ సభలో అడు పెట్టే సంస్కృతి లేదన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.