వైసీపీ న్యాయం మరీ ఇంత బలహీనమా ?

వైసీపీ అధినాయకత్వం పెద్దలు అయితే అరెస్టులు చేస్తారు అయినా భయపడవద్దు అని చెబుతున్నారు. అదే సమయంలో లీగల్ టీం సహాయం ఉంటుందని భరోసా ఇస్తున్నారు.;

Update: 2025-03-01 18:30 GMT

వైసీపీ నాయకులు అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్నపుడు చేసిన ప్రసంగాల మీద వారు అప్పట్లో మాట్లాడిన భాష మీద ఇపుడు కేసులు పడుతున్నాయి. సరే అధికారంలో ఉన్న వారు విపక్షాన్ని టార్గెట్ చేయడం మామూలే. అయితే వైసీపీ తన వారిని రక్షించుకోవడంలో ఏమి చేస్తోంది అన్నదే ఇక్కడ ప్రశ్నగా ఉంది.

వైసీపీ అధినాయకత్వం పెద్దలు అయితే అరెస్టులు చేస్తారు అయినా భయపడవద్దు అని చెబుతున్నారు. అదే సమయంలో లీగల్ టీం సహాయం ఉంటుందని భరోసా ఇస్తున్నారు. కానీ జరుగుతున్నది వేరు అంటున్నారు. లీగల్ టీం అయితే అరెస్టు అయి జైలు గోడల మధ్యన మగ్గుతున్న వారిని కానీ అరెస్ట్ అయిన వారిని కానీ బయటకు తెచ్చే విషయంలో ఫెయిల్ అవుతోంది అని అంటున్నారు.

వైసీపీ లీగల్ టీం కి ప్రధాన కార్యదర్శిగా పొన్నవోలు సుధాకరరెడ్డి ఉన్నారు. అలాగే ప్రెసిడెంట్ గా మనోహర్ రెడ్డి ఉన్నారు. లీగల్ టీం ప్రతీ జిల్లాలో అలాగే నియోజకవర్గాలలో బలంగా ఉంటూ అక్రమ కేసుల విషయంలో గట్టిగా పోరాడుతుందని న్యాయ రక్షణ ఇస్తుందని అధినాయకత్వం చెప్పినా గత తొమ్మిది నెలలుగా పెద్దగా జరిగింది అయితే లేదని అంటున్నారు.

చాలా మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టులు అయి నానా అవస్థలు పడ్డారని గుర్తు చేస్తున్నారు. మరో వైపు చూస్తే కొందరు పెద్ద నాయకులు మాజీ మంత్రుల విషయంలోనూ ఇలాగే జరిగింది అని అంటున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ అయితే నెలల తరబడి జైలులో మగ్గాక ఎట్టకేలకు తన సొంత న్యాయ బలంతోనే బయటకు బెయిల్ మీద వచ్చారు అని అంటున్నారు.

అలాగే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి కూడా తనకు ఉన్న నాయ బృందంతోనే బెయిల్ సాధించగలిగారు తప్ప పార్టీ లీగల్ టీం వల్ల కాదనే అంటున్నారు. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ కూడా బెయిల్ తెచ్చుకున్నది తన సొంత లాయర్ టీం తోనే కానీ పార్టీ నుంచి కాదని అంటున్నారు.

ఇక చూస్తే వరసగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు అయి జైలులో ఉన్నారు. ఆయనకు బెయిల్ విషయంలో వాదించిన లీగల్ టీం బెయిల్ ని తీసుకుని రాలేకపోయింది అని అంటున్నారు. అలాగే లేటెస్ట్ గా పోసాని క్రిష్ణ మురళి విషయంలో కూడా బెయిల్ రాక ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులలో వైసీపీ లీగల్ టీం లాయర్లు బలంగా వాదించలేదా అన్న చర్చ సాగుతోంది.

గతంలో తెలుగుదేశం వారిని అరెస్ట్ చేసినపుడు స్ట్రాంగ్ పాయింట్స్ ని టీడీపీ లీగల్ టీం కోర్టు ముందు పెట్టి బెయిల్ వచ్చేలా చూసుకుంది. అలా మాజీ మంత్రులు ఇతర సీనియర్లు అంతా కూడా బెయిల్ పొందారు. మరి వైసీపీలో అయితే అంతా అరెస్టు అయి ఇబ్బంది పడుతున్నారు అంటే వైసీపీ న్యాయం మరీ ఇంత బలహీనమా అన్న చర్చ వస్తోంది.

వైసీపీ లీగల్ టీం లో మార్పులు చేయాలా అన్న కొత్త చర్చకు కూడా ఇది దారి తీస్తోంది. ఇదే తీరున నేతలు అరెస్టులు జైళ్ళు సాగితే వైసీపీ తరఫున రానున్న రోజులలో ఎవరూ గొంతెత్తి మాట్లాడేది ఉండదని అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం నైతిక మద్దతు గా నిలవడమే కాకుండా లీగల్ టీం కూడా పవర్ ఫుల్ గా నిలబడితేనే నాయకులకు ధైర్యం వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News