నెట్టింట వైసీపీ పత్రికా ప్రకటన... ఇది ఫేక్ న్యూస్!
అవును... ఇన్ ఛార్జ్ ల మార్పు విషయంలో అధికార వైసీపీ కీలక మార్పులు చేపడుతుందంటూ పలురకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే
వైనాట్ 175 అనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్నట్లు చెబుతున్న అధికార వైసీపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మారుస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ 11 మంది ఇన్ ఛార్జ్ లను మారుస్తూ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ సమయలో మరో ఎనిమిది మందిని మార్చారంటూ పార్టీ లెటర్ హెడ్ తో ప్రకటించినట్లుగా ఒక ప్రకటన వైరల్ అవుతుంది.
అవును... ఇన్ ఛార్జ్ ల మార్పు విషయంలో అధికార వైసీపీ కీలక మార్పులు చేపడుతుందంటూ పలురకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మంగళగిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా అనంతరం మొదలైన ఇన్ ఛార్జ్ ల మార్పుతో సుమారు 11 నియోజకవర్గాలకు జగన్ ఇన్ ఛార్జ్ లను మార్చారు. ఈ విషయంలో కేవలం సర్వేల ఫలితాలే కాకుండా.. కేడర్ సలహాలు, ప్రజల అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకోవడంతోపాటు సామాజిక సమీకరణాలనూ భేరీజు వేసుకున్నారని తెలిసింది.
ఈ సమయంలో.. అదే అదనుగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫేక్ ప్రచారం మొదలైంది. ఇందులో భాగంగా... ఎనిమిది నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మార్చారని చెబుతూ ఆ నియోజకవర్గాల పేర్లు, అభ్యర్థుల పేర్లు పొందుపరుస్తూ... పార్టీ లెటర్ హెడ్ లా తయారుచేసిన కాగితాన్ని నెట్టింట షేర్ చేస్తున్నారు. దీంతో... పలువురు సిట్టింగుల్లో అభద్రతాభావం కలిగించే కార్యక్రమంలో భాగంగా రాజకీయ ప్రత్యర్ధులే ఈ పనికి పూనుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో అధికార పార్టీ అలర్ట్ అయ్యింది. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తెలిపింది. ఇప్పటివరకూ అధికారికంగా కేవలం 11 మంది ఇన్ ఛార్జ్ లను మాత్రమే మార్చిందని చెబుతుంది. ఆ 11 నియోజకవర్గాలు తప్ప మిగిలిన ఏ నియోజకవర్గం గురించి ఎలాంటి వార్త వచ్చినా అది ఫేక్ అనే విషయం అటు ప్రజలు, ఇటు పార్టీ శ్రేణులూ గ్రహించాలని చెబుతున్నారు. ఇదే సమయంలో వీటిని ప్రత్యర్థులు చేసే చిల్లర పనులుగా కొట్టిపారేస్తున్నారు.
అదేవిధంగా... ఇలాంటి చిల్లర పనులు చేసేవారు ఉన్నారన్న విషయం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు దృష్టిలో పెట్టుకోవాలని.. పార్టీ అధికారికంగా చెప్పేవరకూ వినిపించే ఏ గాసిప్ నీ పరిగణలోకి తీసుకోవద్దని సూచిస్తున్నారు. దీంతో... ఈ ఫేక్ ప్రచారానికి శుభం కార్డు పడింది!