కీలక నియోజకవర్గంలో వైసీపీలో మూడు ముక్కలాట!
కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గం, విజయవాడకు అత్యంత సమీపంలో ఉన్న నియోజకవర్గం.. పెనమలూరు
కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గం, విజయవాడకు అత్యంత సమీపంలో ఉన్న నియోజకవర్గం.. పెనమలూరు. ఇంతటి కీలక అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అధిష్టానానికి తలపోటుగా మారిందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున కొలుసు పార్థసారధి విజయం సాధించారు. అయితే ఆయనను వచ్చే ఎన్నికల్లో జగన్ బందరు పార్లమెంటు స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాలని కోరారు. దీనికి అంగీకరించని పార్థసారధి తాను పెనమలూరు నుంచే పోటీ చేస్తానని తెలిపారు. దీనికి జగన్ ఒప్పుకోకపోవడంతో టీడీపీలో చేరడానికి పార్థసారథి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పెనమలూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రస్తుతం పెడన ఎమ్మెల్యేగా, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న జోగి రమేశ్ ను ప్రకటించారు. ఈ మేరకు ఇటీవల వైసీపీ విడుదల చేసిన మూడో జాబితాలో పెనమలూరు అభ్యర్థిగా జోగి రమేశ్ ను ప్రకటించారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా పెనమలూరు అభ్యర్థిగా వచ్చిన జోగి రమేశ్ కు సొంత పార్టీ నుంచే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న తుమ్మల చంద్రశేఖర్, డీసీఎంఎస్ చైర్మన్ గా ఉన్న పడమటి స్నిగ్ధల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. వీరిద్దరూ పెనమలూరు నియోజకవర్గానికి స్థానికులు కాగా జోగి రమేశ్ నాన్ లోకల్.
ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారధికి సీటు ఇవ్వనిపక్షంలో స్థానిక అభ్యర్థులమైన తమకు సీటు ఇవ్వాలని తుమ్మల చంద్రశేఖర్, పడమటి స్నిగ్ద కోరుతున్నారు. నియోజకవర్గానికి స్థానికుడు కాని జోగి రమేశ్ కు సహరించేది లేదని తేల్చిచెబుతున్నారు. నాన్ లోకల్ ను తీసుకొచ్చి పెనమలూరు సీటు ఎలా ఇస్తారని వైసీపీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు.
ఈ క్రమంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ అనుచరులు జోగి రమేశ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పెనమలూరు నియోజకవర్గంలోని కోలవెన్ను నుంచి కంకిపాడు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నాన్ లోకల్ జోగి రమేశ్ వద్దు.. తుమ్మలకే సీటు ఇవ్వాలంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు.
మరోవైపు స్థానికుడు కాని జోగి రమేశ్ కు పెనమలూరు సీటు ఇవ్వడాన్ని నిరసిస్తూ డీసీఎంఎస్ చైర్ పర్సన్ పడమటి స్నిగ్ధ ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. గతంలో పడమటి స్నిగ్ధ తండ్రి పడమటి సురేశ్ బాబు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. వైసీపీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం భారీ ఎత్తున ఖర్చు పెట్టుకున్నారు. అలాంటిది తమకు కాకుండా నాన్ లోకల్ జోగి రమేశ్ కు సీటు ఇవ్వడం ఏమిటని నిలదీస్తున్నారు.
ఇక స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థసారధికి పెనమలూరు సీటు ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోగి రమేశ్ కు సహకరించేది లేదని తేల్చిచెబుతున్నారు.
మరోవైపు పెనమలూరు నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం అత్యధికంగా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ లపై తీవ్ర విమర్శలు చేసేవారిలో జోగి రమేశ్ ఒకరు.
ఈ నేపథ్యంలో ఓ వైపు సొంత పార్టీలోనే ముగ్గురు ముఖ్య నేతల నుంచి సహాయ నిరాకరణ, మరోవైపు ఎలాగైన ఓడించాలని టీడీపీకి బలంగా ఉన్న సామాజికవర్గం పట్టుదల వెరసి... మంత్రి జోగి రమేశ్ కు చెమటలు పడుతున్నాయని టాక్ నడుస్తోంది. జోగి ఇక్కడ గెలుపొందడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.