ఏపీ మీద కాంగ్రెస్ ఫుల్ ఫోకస్...?
కనీసంగా అయిదారు శాతం ఓటు షేర్ కూడా కాంగ్రెస్ కి లేకుండా పోయింది.
ఏపీ అన్నది కాంగ్రెస్ కి కంచుకోట. దేశమంతా శ్రీమతి ఇందిరాగాంధీని ఓడించినా జనతా ప్రభంజనం తాకిడి సోకని నేల ఒక్క ఏపీ మాత్రమే. అలాంటి ఏపీ గత పదేళ్లుగా కాంగ్రెస్ ని దూరం పెట్టేసింది. అంతే కాదు చట్ట సభలలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు.
కనీసంగా అయిదారు శాతం ఓటు షేర్ కూడా కాంగ్రెస్ కి లేకుండా పోయింది. కాంగ్రెస్ బేస్ మొత్తం పోయింది. అది అత్యధిక భాగం వైసీపీకి చేరింది. ఈ నేపధ్యంలో వైసీపీ మీద మోజుతో రెండు ఎన్నికల్లో ప్రజలు ఓట్లేశారు. ఒకసారి విపక్షంగా ఉన్నా భారీగానే సీట్లు దక్కాయి. మరోసారి ఏకంగా 151 సీట్లతో అందలం మీద వైసీపీని కూర్చోబెట్టారు. 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీని పూర్తిగా పక్కన పెట్టారు.
ఈ పరిణామమే ఇపుడు కాంగ్రెస్ లో కొత్త ఆశలు రేపుతోంది. అదే టైం లో ఏపీలో కాంగ్రెస్ వేళ్ళూనుకుంటే వైసీపీ దెబ్బ తింటుందని ఆ పార్టీ ఆలోచిస్తోంది. వైసీపీకి ఎన్నో సమస్యలు ఇలా వెంటాడుతున్నాయి. అధికార టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ఎదిరించడం ప్రధానమే కానీ దాని కంటే ముందు వైసీపీ అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి అనుకూల గాలులు వీస్తున్నాయి. దక్షిణాదిన చూసుకుంటే కేరళలో లోక్ సభ ఎన్నికలో మెజారిటీ సీట్లు గెలుచుకుంది. కర్ణాటకలో ఎంపీ సీట్లు తగ్గినా దాని కంటే ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకుంది. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది.
ఇక తమిళనాడులో డీఎంకేతో కలసి కాంగ్రెస్ పటిష్టంగా ఉంది. ఎటొచ్చి ఏపీలోనే కాంగ్రెస్ తీరు అర్థం కాకుండా ఉంది. వైఎస్సార్ ఫ్యామిలీ ఆయన వారసత్వం అని చెప్పి షర్మిలను తెచ్చి పెట్టినా ఆమె వల్ల పార్టీ ఏ మాత్రం పుంజుకోవడం లేదని కాంగ్రెస్ అధినాయకత్వంలో అంతర్మధనం కనిపిస్తోంది అని అంటున్నారు.
ఏపీలో కాంగ్రెస్ ని ఒక లెవెల్ కి పెంచాలీ అంటే ఫేస్ వాల్యూ ఉన్న లీడర్ షిప్ కావాలన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. ఏపీలో చూస్తే కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కానీ జనం లోకి వెళ్ళి పార్టీని పటిష్టం చేసే వారు అయితే లేరు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ వైపు కాంగ్రెస్ చూపు ఉందని అంటున్నారు.
జగన్ ఢిల్లీ ధర్నా తరువాత ఇండియా కూటమితో నడిచేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పినట్లుగా ఉందని ప్రచారం అయితే సాగుతోంది. రానున్న కాలంలో అదే శ్రేయోదాయకం అని కూడా ఆయన భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ ఉన్న ఇండియా కూటమిలో చేరి జాతీయ స్థాయిలో మద్దతు పొందుతూ ఇండియా కూటమి వేవ్ లో 2029లో ఏపీలో అధికారంలోకి రావచ్చును అన్నది వైసీపీ అధినాయకత్వం ఆలోచన అయితే అయి ఉండవచ్చు అని అంటున్నారు.
అంటే కాంగ్రెస్ తో పొత్తుల దాకా వైసీపీ సుముఖంగా ఉంది అని అనుకోవాలి. అయితే కాంగ్రెస్ హై కమాండ్ కి మాత్రం ఇలాంటి ప్రతిపాదనలు నచ్చుతాయా అన్నదే పెద్ద చర్చగా ఉంది అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ బలం పుంజుకోవడం ఎంత అవసరమో పార్టీని మళ్లీ గద్దెనెక్కించడం కూడా అంతే ముఖ్యమని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు.
అంటే ఏపీలో కాంగ్రెస్ పాలన 2029 లో మొదలు కావాలన్నదే ఆ పార్టీ ఆలోచన అని చెబుతున్నారు. వైసీపీ విషయంలో పొత్తుల కంటే విలీనానికే కాంగ్రెస్ పెద్దలు ఓటేస్తారు అని అంటున్నారు. వైసీపీని విలీనం చేసుకుంటేనే బెటర్ అని కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. పొత్తుల పేరుతో పక్క వాయిద్యం గా ఉండడానికి కాంగ్రెస్ ఇష్టపడదు అని అంటున్నారు. ఏపీలో 2029 నాటికి వైసీపీతో పొత్తు లేకపోయినా బలమైన శక్తిగా కాంగ్రెస్ అవతరించే అవకాశాలు ఉంటాయని ఊహిస్తున్నారు.
కాంగ్రెస్ గ్రాఫ్ అప్పటికి పెరిగితే వైసీపీలోని వారు అంతా కాంగ్రెస్ చెంతకే చేరుతారు అన్న లెక్కలు అంచనాలూ కూడా ఉన్నాయని అంటున్నారు. అందువల్ల వైసీపీకి కొత్తగా ఊపిరి పోసేలా పొత్తులు ఎందుకు అన్నదే ఒక చర్చగా ఉందని ప్రచారంలో ఉన్న మాట.
అయితే ఏపీలో వైసీపీ ఉనికిని కాపాడుకోవడం కోసం పొత్తుల దాకా వెళ్తోంది అన్న ప్రచారం ఊపందుకున్న వేళ అది కాస్తా విలీనం దిశగా అడుగులు పడేలా చేస్తుందా అన్నదే మరో పుకార్ల లాంటి వార్తగా ఉంది. మరి ఏమి జరుగుతుందో తెలియదు కానీ ఏపీ మీద చాలా తొందరలోనే కాంగ్రెస్ పూర్తిగా ఫోకస్ పెడుతుందని అంటున్నారు. అపుడే ఈ ప్రచారాలలో ఏవి నిజాలు అన్నవి తెలుస్తాయని అంటున్నారు.