టీడీపీ నేత‌ల‌తో మైండ్ గేమ్‌.. ఎన్నిక‌ల‌కు ముందు చిక్కులు..!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు దూకుడుగా ఉన్నాయి

Update: 2024-01-16 13:30 GMT

ఎన్నిక‌ల‌కు ముందు.. రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు దూకుడుగా ఉన్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌చారాన్ని కూడా ముమ్మ‌రం చేస్తున్నాయి. ఇంత వ‌ర‌కు మంచిదే.. అయితే.. వైసీపీ వ్యూహాత్మ‌కంగా.. టీడీపీని దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆ పార్టీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. టీడీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క వ‌ర్గాల్లో ఆ పార్టీని డైల్యూట్ చేసేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు.

అంటే.. టీడీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అక్క‌డి నేత‌లు.. టీడీపీలో ఇమ‌డ‌లేక పోతున్నార‌ని.. బ‌య‌ట‌కు వ‌చ్చేసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసుకుంటున్నార‌ని.. అందునా.. వైసీపీలో చేరిపో యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ఈ ప్ర‌చారం సాగుతోంది. వైసీపీ సోష‌ల్ మీడియాలో అయితే... సుమారు ఇలాంటి వార్త‌లే హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఇది ఇటు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను.. అటు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌ను కూడా డోలాయ‌మానంలోకి నెడుతోంది.

టీడీపీ ఓటు బ్యాంకు కూడా ప్రభావితం అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇది పార్టీకి మైన‌స్‌గా మారు తుంద‌ని టీడీపీ కూడా అంచ‌నా వేస్తోంది. మా నాయ‌కుడు పార్టీ మారుతున్నాడంటూ.. నియోజ‌క‌వ‌ర్గంలో హాట్ టాపిక్ హ‌ల్చ‌ల్ చేస్తోంది. దీంతో టీడీపీ నేత‌లు అంత‌ర్మ‌థ‌నంలో ప‌డుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఈ ద‌ఫా గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని టీడీపీ లెక్క వేసుకున్న గుంటూరు జిల్లాలోని గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో ఇదే తంతు న‌డుస్తోంది.

ఇక్క‌డి టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే యర‌ప‌తినేని శ్రీనివాస‌రావు పార్టీ మారుతున్నార‌ని.. టీడీపీలో ఆయ‌న‌కు విలువ లేకుండా పోయింద‌ని ఓ వ‌ర్గం మీడియా ప్ర‌చారం చేస్తోంది. అంతేకాదు.. ఆయ‌న త్వ‌ర‌లోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని కూడా చెబుతోంది. వాస్త‌వానికి టీడీపీ ఆవిర్భావం నుంచి య‌ర‌పతినేని ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. టీడీపీలోనే ఉన్నారు.

ప‌ద‌వి ఇచ్చినా.. ఇవ్వ‌క‌పోయినా.. ఆయ‌న పార్టీకి సైనికుడిగా ప‌నిచేశారు. కానీ, ఇప్పుడు వైసీపీ మైండ్ గేమ్‌తో ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడిపైనా ఇదే త‌ర‌హా ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తానికి వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్‌తో టీడీపీ నేత‌లు.. ఉలిక్కి ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది.

Tags:    

Similar News