సొంత జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా ఆయనకే జగన్‌ అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తయ్యాక వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే

Update: 2024-08-22 06:33 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తయ్యాక వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. క్షేత్ర స్థాయి నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా ఆయన సమయమిస్తున్నారు. వారికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతంపైనా వైఎస్‌ జగన్‌ దృష్టి సారించారు.

ముఖ్యంగా ఇటీవల ఎన్నికల్లో జగన్‌ సొంత జిల్లా కడపలోనూ వైసీపీకి గట్టి దెబ్బ పడింది. పది అసెంబ్లీ స్థానాలకు గానూ కేవలం మూడింటిని మాత్రమే వైసీపీ గెలుచుకుంది. వీటిలో పులివెందుల, బద్వేలు, రాజంపేట మాత్రమే ఉన్నాయి.

కాగా కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా ఉన్న ఆకేపాటి అమర్‌ నాథ్‌ రెడ్డి ఇటీవల ఎన్నికల్లో రాజంపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీగా ఉన్న రామగోవిందరెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌ జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా జగన్‌.. కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా రామగోవిందరెడ్డిని ప్రకటించారు.

కాగా ఆకేపాటి అమర్‌ నాథ్‌ రెడ్డి 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో జగన్‌ వైసీపీ ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేశారు. ఆ ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లో మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఆకేపాటి అమర్‌ నాథ్‌ రెడ్డికి పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2014లో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరడంతో జగన్‌ 2019లో ఆయనకే సీటు ఇచ్చారు. దీంతో ఆకేపాటి అమర్‌ నాథ్‌ రెడ్డికి అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో ఆయనను కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ను చేశారు.

2024 ఎన్నికల్లో ఆకేపాటి అమర్‌ నాథ్‌ రెడ్డి మరోసారి వైసీపీ నుంచి రాజంపేటలో పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారి మఠం జెట్పీడీసీగా ఉన్న రామగోవింద్‌ రెడ్డిని కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా జగన్‌ ఎంపిక చేశారు.

కాగా కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రేసులో టీడీపీ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, కడప జిల్లాలో మొత్తం పది మందిలో ఏడుగురు కూటమి ఎమ్మెల్యేలే ఉండటంతో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ స్థానాన్ని దక్కించుకోవాలని ఆయన ప్రయత్నించినట్టు తెలిసింది. దీంతో వైసీపీ అప్రమత్తమైంది. వైసీపీ జెడ్పీటీసీలను టీడీపీలో చేర్చుకుని జెడ్పీ చైర్మన్‌ పీఠాన్ని అధిష్టించాలని ఆ పార్టీ చూస్తుండటంతో జెడ్పీటీసీలను వైసీపీ నేతలు తాడేపల్లి తీసుకెళ్లారు. ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని వారికి జగన్‌ సూచించారు. ఈ క్రమంలో బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డిని కొత్త చైర్మన్‌ అభ్యర్థిగా నియమిస్తున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News