టింగ్.. టింగ్ అన్న హరీశ్ ను ఆన్ లైన్ లో ఆడేసుకుంటున్నారు!

కీలకమైన ఎన్నికల వేళ.. అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నోటి నుంచి వచ్చే మాట ఏ మాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది.

Update: 2023-11-28 05:03 GMT

కీలకమైన ఎన్నికల వేళ.. అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నోటి నుంచి వచ్చే మాట ఏ మాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. మాట్లాడటంలో మంత్రి హరీశ్ కు మించిన తోపు మరొకరు ఉండరన్నట్లుగా చెబుతారు. ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు ఆయన నోటి నుంచి ఆణిముత్యాల్లాంటి మాటలు ఎన్ని వచ్చినా.. ఇప్పటివరకు ఏవీ కూడా దెబ్బేయలేదు. కానీ.. కాలం కలిసి రాకపోతే తాడు సైతం పాములా మారుతుందన్న మాటకు తగ్గట్లే తాజా పరిణామం చోటు చేసుకోవటం తెలిసిందే.

రైతుబంధు డబ్బుల్ని లబ్థిదారుల ఖాతాల్లోకి వేసేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతులు ఇవ్వటం.. దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని విడుదల చేయటం తెలిసిందే. ఇలాంటివేళ.. కట్టలు తెగిన ఉత్సాహంతో మంత్రి హరీశ్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ ఎన్నికల ప్రచారంలో బాగా పాపులర్ అయిన కుయ్.. కుయ్.. అంటూ 108 వెహికిల్స్ గురించి.. ఆపదలో ఉన్న వారికి అత్యవసర చికిత్సను అందించే ఈ వ్యవస్థ మీద ఆయన చెప్పిన తీరును గుర్తు చేస్తూ.. ఈసీ అనుమతుల కారణంగా సోమవారం ఉదయం టీ తాగే టైంకు టింగ్.. టింగ్ అంటూ మొబైల్ ఫోన్లు మోగుతాయని.. అందులో రైతుబంధు అకౌంట్లో పడినట్లుగా మెసేజ్ లు వస్తాయన్న మాటను చెప్పటం తెలిసిందే.

ఈసీ ఆదేశాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ ఒకపక్క అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు మంత్రి హరీశ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కట్ చేస్తే.. కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు డబ్బులు లబ్థిదారుల ఖాతాల్లోకి వేయకుండా నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ నేపథ్యంలో మంత్రి హరీశ్ పై ఒక రేంజ్ లో ఆడేస్తున్నారు నెటిజన్లు. కొందరు.. హరీశ్ అత్యుత్సాం కొత్త సమస్యలకు కారణంగా మారిందని కొందరు పేర్కొంటే.. మరికొందరు మాత్రం వినూత్న రీతిలో రియాక్టు అవుతున్నారు.

టైం చూసుకొని మరీ మామను దెబ్బేశాడుగా అంటూ కాస్తంత తీవ్రమైన కామెంట్లు సైతం చేస్తున్నారు. ఇంతకాలం హరీశ్ మాటల్ని పొగడటమే కాదు.. వేలెత్తి చూపింది లేదు. అందుకు బిన్నంగా తాజా పరిణామం చోటు చేసుకోవటంతో హరీశ్ షాక్ కు గురైనట్లుగా చెబుతున్నారు. తనపై వస్తున్న విమర్శలు.. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు వీలుగా సోమవారం రాత్రి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టటం తెలిసిందే. ఏమైనా.. వైఎస్ ను గుర్తుకు తెచ్చేలా వ్యవహరించిన హరీశ్ రావు మాటలతో జరిగిన నష్టంపై గులాబీ దళం గుర్రుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News