8 ఇవ్వ‌మంటోన్న ష‌ర్మిల‌.. 3 ఇస్తామంటోన్న కాంగ్రెస్‌!

కొంత‌కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం గురించి జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

Update: 2023-08-17 05:40 GMT

కొంత‌కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం గురించి జోరుగా ప్ర‌చారం సాగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానంతో చ‌ర్చ‌లు పూర్త‌య్యాయ‌ని, ష‌ర్మిల‌ త్వ‌ర‌లోనే త‌న పార్టీని కాంగ్రెస్‌లో క‌లిపేస్తుంద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. అందుకు ఈ నెల రెండో వారంలోనే ముహూర్తం పెట్టిన‌ట్లు టాక్ వినిపించింది.

ష‌ర్మిల ఢిల్లీ వెళ్ల‌డం, అక్క‌డ కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుల‌తో మంత‌నాలు జ‌ర‌ప‌డంతో విలీనం ప్ర‌క్రియ పూర్త‌వనున్న‌ట్లు క‌నిపించింది. కానీ ఎలాంటి ప్ర‌క‌ట‌న లేకుండానే ష‌ర్మిల తిరిగి హైద‌రాబాద్ చేరుకోవ‌డం చ‌ర్చ‌నీయాశంగా మారింది. అయితే ష‌ర్మిల తెలంగాణ‌లో పోటీ చేసేందుకు 8 సీట్లు ఇవ్వాల‌ని అడిగితే.. కాంగ్రెస్ 3 మాత్ర‌మే ఇస్తామ‌ని చెప్ప‌డంతో విలీన ప్రక్రియ ముందుకు సాగ‌ట్లేద‌ని స‌మాచారం.

ఢిల్లీలో ఏఐసీసీ కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్‌తో చ‌ర్చ‌ల సంద‌ర్భంగా ష‌ర్మిల ఓ ప్ర‌తిపాద‌న ముందు పెట్టిన‌ట్లు తెలిసింది. త‌న‌తో పాటు త‌న అనుచ‌రుల‌కు క‌లిపి వ‌చ్చే ఎన్నిక‌ల్లో 8 టికెట్లు ఇస్తే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తాన‌ని ష‌ర్మిల చెప్పిన‌ట్లు స‌మాచారం. కానీ కాంగ్రెస్ మాత్రం 3 సీట్లు ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్న‌ట్లు తెలిసింది. దీంతో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుండానే ష‌ర్మిల హైద‌రాబాద్ వ‌చ్చేశారు. ఈ విష‌యంలో రెండు వ‌ర్గాల‌కు న‌చ్చేలా ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటే వెంట‌నే కాంగ్రెస్‌లో ష‌ర్మిల పార్టీ విలీన‌మ‌వుతుంద‌ని టాక్‌. అదే జ‌రిగితే తెలంగాణ ఎన్నిక‌ల్లో పాలేరు నుంచి ష‌ర్మిల పోటీ చేసే అవ‌కాశ‌ముంది. మ‌రోవైపు ఏపీకే ష‌ర్మిల‌ను ప‌రిమితం చేయాల‌నుకున్న కాంగ్రెస్‌.. ఆ త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్న‌ట్లు స‌మాచారం. ష‌ర్మిల‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నంత మాత్రాన తెలంగాణ‌లో పార్టీకి ఎలాంటి న‌ష్ట‌ముండ‌ద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డికి అధిష్ఠానం న‌చ్చ‌జెప్పిన‌ట్లు తెలిసింది.

Tags:    

Similar News