వైసీపీ పిల్ల కాలువ...చెల్లెమ్మ మాటలకు అర్ధాలు ?

అంటే పిల్ల కాలువలు అన్నది వైసీపీని ఉద్దేశించి అని అంటున్నారు. పిల్ల కాంగ్రెస్ అని గతంలో టీడీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. ఇపుడు పిల్ల కాలువ అని షర్మిల అంటున్నారు.

Update: 2024-06-20 03:30 GMT

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మళ్లీ దూకుడు పెంచారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ రాహుల్ ప్రియాంకలతో భేటీ అయిన షర్మిల పలు విషయాలు చర్చించారు. అలాగే కాంగ్రెస్ పెద్దలు ఆమెకు ఏపీలో పార్టీని పటిష్టం చేయడం మీద దిశా నిర్దేశం చేశారు. దాంతో షర్మిల మళ్లీ యాక్టివ్ అయ్యారు.

పోలింగ్ ముగిసిన తరువాత దాదాపుగా నెల రోజుల పాటు మౌనంగా ఉన్న షర్మిల ఇపుడు మళ్ళీ ఏపీలో హల్ చల్ చేస్తున్నారు. ఆమె అధికార టీడీపీ కూటమికి సూచనలు ఇస్తూనే డిమాండ్లూ పెడుతున్నారు. ప్రత్యేక హోదాను ఇప్పటికైనా చంద్రబాబు తీసుకుని రావాలని షర్మిల కోరుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది అంటే అది చంద్రాబాబు దయ వల్లనే అని ఆమె గుర్తు చేస్తున్నారు.

అంటే ప్రత్యేక హోదా అంశాన్ని ఆమె అస్త్రంగా చేసుకుని ఏపీలో రానున్న అయిదేళ్ల విపక్ష పాత్రకు రెడీ అవుతున్నారు అన్న మాట. కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానని అంటోంది. ఎండీయే ప్రభుత్వం అయితే ఈ రోజుకీ ఆ మాట మాట్లాడడం లేదు. సరిగ్గా ఇదే పాయింట్ షర్మిలకు అడ్వాంటేజ్ గా మారుతోంది. దాంతో ఆమె ప్రత్యేక హోదా తెస్తారా లేదా అని కూటమి నేతల మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఇది సహజంగానే కాంగ్రెస్ కి జనంలోకి వెళ్ళేందుకు ఉపయోగపడే పాయింట్ గానే ఉండబోతోంది.

మరో వైపు చూస్తే రాజకీయంగా కూడా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఏపీలో పోయిన చోటనే వెతుక్కోవాలని చూస్తోంది. అందుకోసం ఆమె దూకుడు పెంచుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల మీద కాంగ్రెస్ కన్నేసింది అని షర్మిల మాటల బట్టి అర్ధం అవుతోంది. ఆమె మీడియాతో మాట్లాడిన నేపధ్యంలో వైసీపీ నుంచి నేతలు కాంగ్రెస్ లో చేరుతారా అంటే పిల్ల కాలువలు అన్నీ సముద్రంలోనే చివరికి చేరాలి కదా అని తెలివైన జవాబు చెప్పారు.

అంటే పిల్ల కాలువలు అన్నది వైసీపీని ఉద్దేశించి అని అంటున్నారు. పిల్ల కాంగ్రెస్ అని గతంలో టీడీపీ విమర్శలు చేస్తూ వచ్చింది. ఇపుడు పిల్ల కాలువ అని షర్మిల అంటున్నారు. వైసీపీలో ఉన్న వారిలో నూటికి డెబ్బై మందికి పైగా కాంగ్రెస్ వారే. దాంతో తిరిగి వారిని తమ వైపునకు తిప్పుకోవడానికి షర్మిల చూస్తున్నారు అని అంటున్నారు. ఎన్నికల వేళ చాలా మందికి వైసీపీ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు షర్మిల ఇచ్చారు. వారి వల్లనే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో ఓట్లు చీలి వైసీపీ నష్టపోయింది అని అంటున్నారు.

ఇపుడు ఏకంగా వైసీపీలోని బిగ్ షాట్స్ మీదనే కాంగ్రెస్ హై కమాండ్ ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. ఈసారి 232 సీట్ల దగ్గర ఆగిన ఇండియా కూటమి మరో అయిదేళ్ళలో ఏకంగా అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. రానున్న రోజులు కాంగ్రెస్ వే అని షర్మిల అంటున్నారు. బీజేపీలో చేరలేని వారు, తమ ఐడియాలజీకి సరిపడని వారు అంతా కాంగ్రెస్ వైపు తిరిగి చూసే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తున్న నేపధ్యంలో షర్మిల చేసిన పిల్ల కాలువ వ్యాఖ్యలు కచ్చితంగా వైసీపీని టార్గెట్ చేసేవే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News