కడపలో ఎంపీగా షర్మిల: నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ కి....!?
కడప ఎంపీ సీటుకు కాంగ్రెస్ తరఫున షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె గెలుస్తాను అని అంటున్నారు
కడప ఎంపీ సీటుకు కాంగ్రెస్ తరఫున షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె గెలుస్తాను అని అంటున్నారు. అయితే కడప జిల్లాలో పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నాయా అంటే 2019 నాటి ఫలితాలను చూడాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి రెండవసారి పోటీ చేశారు. ఆయనకు ఆ ఎన్నికల్లో 7 లక్షల 83 వేల 499 ఓట్లు వచ్చాయి. ఆయన మీద అప్పటి మంత్రి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణరెడ్డికి నాలుగు లక్షల రెండు వేల 773 ఓట్లు లభించాయి.
ఇక మూడవ స్థానంలో ఇక్కడ నోటా నిలిచింది. నోటాకు 14 వేల 692 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ కి అంతకంటే దారుణంగా 8 వేల 341 ఓట్లు దక్కాయి. అంటే మొత్తం పోల్ అయిన ఓట్లలో కాంగ్రెస్ కి దక్కినవి 0.53 శాతం ఓట్లు అన్న మాట. ఆ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్ల షేర్ 49.89 శాతంగా ఉంది. టీడీపీకి 25.65 శాతం ఓట్ల షేర్ దక్కింది. మరి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాంగ్రెస్ ఈసారి గెలుస్తుందా కడపలో ఎంపీ సీటుని సాధిస్తుందా అన్నది చర్చగా ఉంది.
కడపలో కాంగ్రెస్ చివరిసారిగా గెలిచింది. 2009 ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ జగన్ గెలిచారు. ఆయన ఆ ఎన్నికల్లో తొలిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. అపుడు ఆయన తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక ఆ తరువాత 2011లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ సొంత పార్టీ పెట్టుకొని కడప ఎంపీగా రెండవ మారు పోటీ చేస్తే ఆయనకు అయిదున్నర లక్షల మెజారిటీ దక్కింది. కడప ఎంపీ చరిత్రలో ఇదే అతి పెద్ద మెజారిటీగా ఉంది.
ఇక అయిదేళ్ల కాలం గడచింది కాబట్టి వైసీపీకి ఆదరణ తగ్గింది అని భావించి షర్మిల పోటీలో ఉండవచ్చు. పైగా వైఎస్ వివేకా దారుణ హత్య కేసులో హంతకుడిగా ఆమె కడప ఎంపీని చూపిస్తున్నారు. ఆయనను ఓడించాల్సిందే అని పిలుపు ఇస్తున్నారు. కడపలో వైఎస్ వివేకా పట్ల జనాలకు అభిమానం ఉంది.
ఆయన కూడా రెండు సార్లు కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా పనిచేశారు. ఆయన 1991 నుంచి 20011 దాకా అంటే ఇరవై ఏళ్ల పాటు చురుకైన పాత్రను రాజకీయాల్లో పోషించారు. కడప పులివెందులలో వైఎస్ వివేకా అంటే అభిమానం ఉన్న జనాలు ఉన్నారు.
అందుకే షర్మిల తన చిన్నాన్న పేరుని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆమె ఎక్కువగా వైఎస్సార్ కంటే కూడా చిన్నాన్న పేరుని తలుస్తున్నారు. ఆయనను హత్య చేసిన వారికి ఓటేయొద్దు అని జనాలకు పిలుపు ఇస్తున్నారు. ఈ విషయంలో జనం మద్దతు తనకే ఉంటుందని ఆమె గట్టిగా నమ్ముతున్నారు.
అయితే కాంగ్రెస్ ఏపీని అడ్డంగా విడగొట్టిన పార్టీ. జనాలు పెద్దగా లేని పార్టీ. కడప అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ అయితే లేదు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కి నోటా కంటే కూడా తక్కువ సీట్లు లభించాయి.
ఇక కడప ఎంపీ సీటులో గెలవాలీ అంటే కచ్చితంగా భారీగానే ఓట్లు తెచ్చుకోవాలి. కడపలో ప్రస్తుతం ఉనన్ ఓటర్ల సంఖ్య చూస్తే 16 లక్షల 6 వేల 127 గా ఉంది. ఇందులో ఎనభై శాతం ఓటింగ్ జరుగుతుందని లెక్క వేసినా 13 లక్షల ఓట్లు పోల్ అవుతాయి. ఇందులో టీడీపీకి సాలిడ్ గా నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి. అలాగే వైసీపీకి కూడా ఎనిమిది లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు పంచుకుంటేనే 12 లక్షల ఓట్లు అయిపోయాయి. షర్మిల గట్టిగా ప్రచారం చేస్తే ఆ లక్ష ఓట్లు కాంగ్రెస్ కి పడినా గెలుపు దక్కే చాన్స్ ఉంటుందా అన్నది చర్చగా ఉంది.
పైగా ఎన్నికలు అంటే ఎలక్షనీరింగ్ చేయాలి. కాంగ్రెస్ కి బూత్ లెవెల్ లో మ్యానేజ్ చేసేవారు ఎవరు అన్నది చర్చగా ఉంది. పోనీ కాంగ్రెస్ టీడీపీ పరస్పరం సహకరించుకుంటే అపుడు కూడా కాంగ్రెస్ ఓటింగ్ పెరుగుతుంది తప్ప గెలుపు వైపు అడుగులు పడవు అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్ధి షర్మిలకు అవుట్ రేట్ గా టీడీపీ మద్దతు ఇచ్చి వ్యూహాత్మకంగా వ్యవహరించినా వైసీపీకి 2019లో వచ్చిన నాలుగు లక్షలకు మెజారిటీని తగ్గినవచ్చు.
అంతే తప్ప గెలుపు చాన్స్ ఉండదు అని అంటున్నారు. ఇక వివేకా హత్య కేసు మీద ఈ ఎన్నికలు జరిపించాలని షర్మిల చూస్తున్నారు. దాని వల్ల లాభం ఎంత మేరకు ఉంటుంది అనేది కూడా ఆలోచించాల్సిందే అంటున్నారు. అయిదేళ్ల క్రితం హత్య జరిగింది. ఇపుడు ఇంకా అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి.
వాటి మీద కూడా షర్మిల ఫోకస్ చేస్తే ఆమె వైఎస్సార్ అభిమానుల నుంచి ఇంకా దాటి సామాన్య జనం లోకి కాంగ్రెస్ పార్టీని తీసుకుని వెళ్లగలరు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ప్రస్తుతానికైతే కడప ఎంపీగా షర్మిల పోటీ అంటే అతి పెద్ద సాహసమే చేస్తున్నారు అని అంటున్నారు.