షర్మిల అలా ఫిక్స్ అయిపోయారా ?

షర్మిల ఆడ పిల్లను కాదు ఈడ పిల్లనే అన్న దగ్గర నుంచే ఏపీ రాజకీయాల్లో కొత్త వేడి పుట్టింది. అది కూడా ఎక్కువగా వైసీపీనే తాకుతోంది

Update: 2024-05-25 03:39 GMT

షర్మిల ఆడ పిల్లను కాదు ఈడ పిల్లనే అన్న దగ్గర నుంచే ఏపీ రాజకీయాల్లో కొత్త వేడి పుట్టింది. అది కూడా ఎక్కువగా వైసీపీనే తాకుతోంది. ఆ పార్టీకే సెగ పెడుతోంది. జనవరిలో ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన షర్మిల ఎన్నికల వేళ అనూహ్యంగా కడప ఎంపీగా పోటీ చేసారు. ఆమె ఓట్ల చీలికకే అలా చేశారు అని వైసీపీ ఆరోపించింది. కాదు గెలిచి చూపిస్తాను అని ఆమె అంటున్నారు.

చివరికి ఆమె గెలవకపోయినా వైసీపీ అభ్యర్ధి అవినాష్ రెడ్డిని మూడు చెరువుల నీళ్ళు తాగించేసి బొటా బొటీగా గెలిచినట్లు చేసినా అది అద్భుత విజయంగానే తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంటుంది. ఆ మీదట షర్మిల ఏమి చేస్తారు చాప చుట్టేసి సైలెంట్ గా ఉండిపోతారా అంటే అలా కానే కాదు అన్నది తాజాగా ఆమె వేస్తున్న వేడి వేడి ట్వీట్లు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికలు అయిపోయాక పది రోజుల వ్యవధిలో రెండు ట్వీట్లు ఆమె వేశారు.

తొలి ట్వీట్ సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో వివేకా హత్య మీద మాట్లాడవచ్చు అన్న దాని మీద వేశారు. న్యాయం గెలిచింది అంటూ వైసీపీ నేతల వైఖరిని నీచమైనదిగా శాడిస్టిక్ నేచర్ గా ఆమె అభివర్ణించడం మంట పుట్టించింది. అంతటితో ఆగక న్యాయం గెలుస్తుంది అన్నారు, అది కడప ఎంపీ ఫలితం మీద దాని కోసం వేచి చూడాలి.

ఇల లేటెస్ట్ గా షర్మిల మరో ట్వీట్ చేశారు. "నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు, నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారూ... మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, మహిళల బ్రతుకులకు పట్టిన పీడ గురించి దేశమంతా చెప్పుకుంటోంది.

రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో... సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు" అంటూ షర్మిల సోషల్ మీడియాలో స్పందించారు.

తాజాగా ఏలూరు జిల్లాలో ఓ పదో తరగతి బాలికపై తరగతి గదిలోనే అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పై ధ్వజమెత్తారు. లండన్ వీధుల్లో పొర్లుదండాలు మధ్య విహరిస్తున్న మీకు ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు అని షర్మిల ఘాటుగానే విమర్శించారు.

దీనిని బట్టి తగ్గేదేలే అన్నట్లుగా ఆమె వైఖరి ఉంది అని అంటున్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కి వచ్చే ఓట్లూ సీట్లూ తన గెలుపు వంటి వాటితో సంబంధం లేకుండా పూర్తిగా ప్రతిపక్ష పాత్రను పోషించాలని ఆమె సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఆమె డైరెక్ట్ గానే బలమైన పోరాటాలు చేస్తారని అంటున్నారు.

ఇక టీడీపీ కూటమి వస్తే ఆమె వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలను ప్రోత్సహించడానికి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు అని అంటున్నారు. ఇండియా కూటమికి ఈసారి కేంద్రంలో అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే షర్మిల పంట పండినట్లే అంటున్నారు.

అలా కాకుండా కాంగ్రెస్ సెంచరీ కొట్టినా కూడా ఏపీలో ఆమె రాజకీయ దూకుడుని ఆపలేరని అంటున్నారు. మొత్తానికి షర్మిల ఈసారి ఈడ పిల్లగానే ఏపీలో ఉంటూ పోరాటం చేయడానికి రెడీ అంటున్నారు. ఆమె అలా ఫిక్స్ అయిపోయారు. సో ఏపీలో అధికారం ఎవరిది ఓటమి ఎవరిది అన్న టెన్షన్ వైసీపీ టీడీపీలకు ఉండొచ్చు. కానీ షర్మిల మాత్రం తన పాత్ర ఇదే అని ఫుల్ క్లారిటీగా ఉన్నారని అంటున్నారు.

Tags:    

Similar News