"మీకు అసెంబ్లీ ఎందుకు.. మీడియా పాయింటే ఎక్కువ"... షర్మిళ సెటైర్లు పీక్స్!

దీంతో... ఈ వైసీపీ ఘాటు రియాక్షన్ కు అంతకు మించిన ఘాటు రిప్లై ఒకటి పెట్టారు షర్మిళ.

Update: 2024-07-29 10:01 GMT

ఏపీలో పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచీ జగన్ పై నిప్పులు చెరుగుతున్న వైఎస్ షర్మిల... ఎన్నికల ప్రచార సమయంలో ఆ డోస్ మరింత పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక జగన్ అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైనా.. షర్మిళ వదిలిపెట్టడం లేదు. జగన్ లక్ష్యంగా నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ వైరం మరింత తీవ్రమైందనిపిస్తుంది!

అవును... "సిగ్గు సిగ్గు! మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకుముంచిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు.. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనం" అంటూ షర్మిళ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

ఈ ట్వీట్ కి... చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికీ.. ప్రజల తరుపున ప్రతీక్షణం ఆలోచించి, వారి కోసం పనిచేసేవారికీ మధ్య తేడా ఉంటుందంటూ వైసీపీ రియాక్ట్ అయ్యింది. ఇదే సమయంలో... షర్మిళ మాటలు చూస్తే జగన్ పై ద్వేషం కనిపిస్తోందే తప్ప, ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదని పేర్కొంది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఎప్పుడైనా ప్రశ్నించారా అంటూ నిలదీసింది.

ఇదే క్రమంలో... పావురాల గుట్టలో పావురమైపోయాడని వైఎస్సార్ మరణాన్ని అవహేళన చేసినవారితో మీరు కలిసి నడవడం లేదా..? తెలంగాణలో పుట్టా, తెలంగాణలోనే ఉంటా అంటూ మాటలు చెప్పి, అక్కడ నుంచి పారిపోయి ఏపీకి రాలేదా..? మీకన్న పిరికివాళ్లు, మీకన్న అస్థిరత్వం లేనివాళ్లు, మీకన్నా అహంకారులు, స్వార్థపరులు ఎవరైనా ఉంటారా? అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది వైసీపీ.

దీంతో... ఈ వైసీపీ ఘాటు రియాక్షన్ కు అంతకు మించిన ఘాటు రిప్లై ఒకటి పెట్టారు షర్మిళ. ఈ సందర్భంగా... జగన్ ని అసెంబ్లీకి వచ్చి చంద్రబాబుని నిలదీయమని చెబితే.. అది తాను చంద్రబాబుకి కొమ్ముకాసినట్లు ఉందా అని ప్రశ్నిస్తూ మొదలుపెట్టిన షర్మిల... “మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి” అంటూ కామెంట్ చేశారు. “మిమ్మల్ని అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే” అంటూ ఫైర్ అయ్యారు.

అయితే... “మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని.. అందుకే అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనబడుతున్నాడని” సెటైర్లు వేశారు షర్మిళ. ఇక... "సోషల్ మీడియాలో నన్ను కించపరిచేటంత ద్వేషం మీకు ఉది.. మాకు ద్వేషం లేదు.. కానీ, తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది" అని చెప్పుకున్న షర్మిళ... ఒక ప్రతిపక్ష మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు.

ఇక తప్పుచేస్తే ఏ పార్టీని అయినా ప్రశ్నించే అధికారం తమకు ఉందని.. అది అధికార పార్టీనా, ప్రతిపక్ష పార్టీనా అనంది ముఖ్యం కాదని చెప్పిన షర్మిళ... జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పని.. చట్ట సభను గౌరవించకపోవడం తప్పని.. కాబట్టే రాజీనామా చేయమని అడుగుతున్నట్లు స్పష్టం చేశారు. వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తే.. అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీని హెచ్చరించింది తానే అని అన్నారు.

ఈ సందర్భంగా... అసలు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు వైఎస్సార్ విగ్రహాలకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడిన షర్మిళ... నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈ రోజు వైఎస్సార్ కు ఇంత అవమానం జరిగి ఉండేది కాదని స్పష్టం చేశారు.

ఇక.. అసలు వైసీపీలో వైఎస్సార్, విజయమ్మను అవమానించినవారే కదా పెద్దవాళ్లు అని ప్రశ్నించిన షర్మిళ... వైఎస్సార్సీపీలో వైఎస్సార్ ని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా అని అన్నారు. ఇప్పుడు వైఎస్సార్సీపీలో "వై" అంటే వైవీ సుబ్బారెడ్డి, "ఎస్" అంటే సాయిరెడ్డి, "ఆర్" అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే అని అన్నారు. అందువల్లే వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడటం చేతకాదు అని.. మీకు మీడియా పాయింటే ఎక్కువని షర్మిళ ఎద్దేవా చేశారు.

ఇదే క్రమంలో... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నట్లు చెప్పిన షర్మిళ... 3వేల కోట్లతో ప్రతీఏటా ధరల స్థిరీకరణ నిధి అని, 4వేల కోట్లతో ప్రతీ ఏటా పంట నష్టపరిహారం అని రైతులను నిలువునా మోసం చేసింది వైసీపీ ప్రభుత్వమే అని.. వైఎస్సార్ జలయజ్ఞానికి తూట్లు పొడిచారని దుయ్యబడుతూ... మీ కంటే మోసగాళ్లు ఉంటారా అని ప్రశ్నించారు.

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లుగా... "మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువణువునా పిరికితనం పెట్టుకున్న మీరు.. బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు.. రాష్ట్ర ప్రయోజనాలను వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి తాకట్టు పెట్టారు" అని చెప్పిన షర్మిళ... "మీ అహంకారమే మీ పతనానికి కారణం" అని కన్ క్లూడ్ చేశారు.

Tags:    

Similar News