జగన్ ని ఓడించండి...ఓపెన్ అయిన చెల్లెలు...!
జగన్ ప్రభుత్వం గద్దె దిగాలి అంటూ ఇంతకాలం మాట్లాడిన ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఇపుడు ఏకంగా జగన్ ని ఓడించండి అని ఓపెన్ అయిపోయారు.
జగన్ ప్రభుత్వం గద్దె దిగాలి అంటూ ఇంతకాలం మాట్లాడిన ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఇపుడు ఏకంగా జగన్ ని ఓడించండి అని ఓపెన్ అయిపోయారు. కడప లోక్ సభ ఎంపీగా ఆమె కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఆ లోక్ సభ పరిధిలోని పులివెందుల అసెంబ్లీకి జగన్ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు.
జగన్ ని ఓడించండి అని షర్మిల శుక్రవారం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ప్రకటించారు. ఆమె బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. ఎనిమిది రోజుల పాటు ఈ బస్సు యాత్ర కడప లోక్ సభ నియోజకవర్గం పరిధిలో సాగుతుంది.
జగన్ ప్రభుత్వం ఓడడం అన్నది నిన్నటి మాట అయితే పులివెందులలో జగన్ ని ఓడించడం అంటే షర్మిల డైరెక్ట్ ఫైట్ కే రెడీ అయ్యారని అంటున్నారు. ఆమె వెంట మాజీ మంత్రి దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె ఉన్నారు. ఆమె ఇటీవలే అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ అవినాష్ రెడ్డి జగన్ ఈ ఇద్దరూ ఓడడం జరగాలని ప్రకటించారు.
ఇపుడు షర్మిల అదే మాట మాట్లాడుతున్నారు. మరో వైపు చూస్తే ఆ దిశగానే కాంగ్రెస్ పావులు కదుపుతోంది అని అంటున్నారు. పులివెందులలో వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీకి సిద్ధపడుతున్నారని అంటున్నారు.
ఆమె జగన్ కి పిన్ని అవుతారు. అంటే అబ్బాయితో పిన్నమ్మ పోటీకి దిగుతున్నారు అన్న మాట. వివేకా ఉన్నపుడు ఆ కుటుంబం నుంచి ఎవరూ కనిపించేవారే కాదు. ఇపుడు సౌభాగ్యమ్మ పోటీ అంటే ఏకంగా జగన్ ని ఓడించడానికి భారీ స్కెచ్ గీస్తున్నట్లుగానే అంటున్నారు. ఇక టీడీపీ నుంచి బీటెక్ రవి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
మరో వైపు చూస్తే కడప టీడీపీ ఎంపీ అభ్యర్ధి విషయంలో మళ్లీ చర్చ సాగుతోంది. ఈ సీటు బీజేపీకి ఇవ్వడం ద్వారా జాతీయ స్థాయిలో ఆ పార్టీ మద్దతు తీసుకుంటే వ్యవస్థలు కూడా అనుకూలం చేసుకోవచ్చు అన్న చర్చ కూడా సాగుతోందిట. బీజేపీ నుంచి ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీ గా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఆయన అయితే జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ నే కోరుకుంటున్నారు.
అయితే ఇపుడు కడపలో జగన్ చెల్లెలే పోటీలో ఉండడంతో ఓట్లు వైసీపీవి చీలితే అది లాభిస్తుంది అన్న దాన్ని చూపించి ఆదిని పోటీకి దించాలని చూస్తున్నారు అంటున్నారు. ఆదికి కడప జిల్లాలో సొంతంగా కొంత బలం పట్టు ఉంది. ఈ మొత్తం పరిణామాలు చూస్తూంటే వైసీపీ అలెర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.
ఏపీ అంతా వేరే అజెండాతో ఎన్నికలు జరుగుతున్నా కడపలో మాత్రం వైఎస్ వివేకా హత్య మీదనే ఈసారి ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఆయన్ని దారుణంగా చంపారని ఆ హంతకులకు వైసీపీ ప్రభుత్వం రక్షిస్తోందని షర్మిల సునీత ఆరోపిస్తున్నారు. ఇవే ఆరోపణలను ఇప్పటిదాకా టీడీపీ కూడా అంటూ వచ్చింది.
మొత్తానికి వైఎస్సార్ కుటుంబం రెండుగా నిట్టనిలువునా చీలిపోయింది. ఈ నేపధ్యంలో కడప వాసుల ఆలోచనలు ఎలా ఉంటాయో వారి తీర్పు ఏమిటి అన్నది చర్చకు వస్తున్న విషయం. ఎన్నడూ లేని విధంగా కడప ఇపుడు ఏపీలో హాట్ హాట్ పాలిటిక్స్ గా మారుతోంది.