జగన్ కు షర్మిల రాఖీ లేనట్లే..?

అన్నాచెల్లెళ్ల అనుంబంధానికి ప్రతీక అయిన రాఖీని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా అత్యంత వేడుకగా జరుపుకొంటారు

Update: 2023-08-31 06:41 GMT

అన్నాచెల్లెళ్ల అనుంబంధానికి ప్రతీక అయిన రాఖీని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా అత్యంత వేడుకగా జరుపుకొంటారు. వాస్తవానికి కొన్ని పండుగలు ఉత్తరాది, కొన్ని పండుగలు దక్షిణాదికి ప్రత్యేకం. కానీ, రాఖీ అలా కాదు. బెంగాల్ నుంచి గుజరాత్ వరకు.. తమిళనాడు నుంచి ఢిల్లీ దాకా దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ అంటే మహా సంబరమే. పెద్ద ఎత్తున దుకాణాలు వెలుస్తుంటాయి. ఇదే సమయంలో రాజకీయ నాయకులకు ఆయా పార్టీల మహిళా నేతలు రాఖీలు కట్టి తమ సోదర భావం వ్యక్తం చేస్తుంటారు.

వైఎస్ కు రాఖీల పరంపర

తెలుగు రాష్ట్రాలకు ఎందరో సీఎంలుగా చేసి ఉండొచ్చు. పాలన పరంగా ప్రత్యేకంగా నిలిచిన వారిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. కాంగ్రెస్ మహిళా నేతగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టి.. చేవెళ్ల చెల్లెమ్మగా ఆమెను సంబోధిస్తూ రాఖీ కట్టించుకునేవారు వైఎస్. ఆమె ఒక్కరే కాదు.. వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సునీతారెడ్డి తదితరులు కూడా వైఎస్ కు రక్షాబంధనం కట్టేవారు. అలా తెలుగు రాష్ట్రాల సీఎంలలో రాఖీకి నిదర్శనంగా నిలిచారు వైఎస్. కాగా , టీడీపీ అధినేత చంద్రబాబుకూ ఆ పార్టీ మహిళా నేతలు రక్షా బంధనం కడుతుంటారు.

నాడు వైఎస్ కు .. నేడు జగన్ కు

ఒకనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాఖీ సందర్భంగా మహిళా నాయకులు రాఖీ కట్టేందుకు ఎంతగా పోటీ పడ్డారో.. ఆయన కుమారుడు వైఎస్ జగన్ కూ అంతే స్థాయిలో పోటీ పడ్డారు. జగన్ సీఎం అయిన కొత్తలో ఈ సందర్భం కనిపించింది. కాగా, జగన్ కు రాఖీ కట్టేందుకు అసలైన చెల్లి వైఎస్ షర్మిల. రెండేళ్ల కిందట వరకు ఏటా ఆమె అన్నకు రాఖీ కట్టిన ఫొటోలు బయటకు వచ్చేవి.

ఈసారి లేనట్టేనా?

2021 లో వైఎస్ జగన్ తో విబేధించి తెలంగాణలో తండ్రి వైఎస్సార్ పేరిట పార్టీని నెలకొల్పారు షర్మిల. ఇది 2021 జూలైలో జరిగింది. అంటే రాఖీ పండుగకు ముందే. మరి ఆ ఏడాది రాఖీ కట్టేందుకు వెళ్లారా? లేదా? అనేది సందేహమే అయినా.. గత ఏడాది నుంచి మాత్రం ఆమె సోదరుడికి రక్షా బంధనం కట్టడం లేదు. ఈ ఏడాది అయితే అసలు అవకాశమే లేకుండా పోయినట్లు స్పష్టమవతోంది.

షర్మిల ఢిల్లీలో.. జగన్ తాడేపల్లిలో

రెండేళ్లుగా జగన్ -షర్మిల మధ్య సాగుతున్న విభేదాలు ఈసారి పతాక స్థాయికి చేరాయి. షర్మిల ఏకంగా అన్న జగన్ తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడా కాంగ్రెస్ లోకే తన పార్టీని విలీనం చేస్తున్నారు షర్మిల. ఇందుకోసం ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అంటే షర్మిల అన్న జగన్ కు రాఖీ కట్టే అవకాశం లేదని స్పష్టమవుతోంది. జగన్ కు రాఖీ కట్టే ఉద్దేశం ఒకవేళ షర్మిల ఢిల్లీ నుంచి రావాలనుకున్నప్పటికీ కాంగ్రెస్ అగ్ర నేతలను కలిసే అపాయింట్ మెంట్ ఉన్నందున వీలు కాదేమో? కాగా ఏపీ సీఎం జగన్ గురువారం రాష్ట్రంలోనే ఉండనున్నారు. దీన్నిబట్టి జగన్ కు షర్మిల రక్షా బంధనం ఈ ఏడాది లేదని స్పష్టమవుతోంది. కాగా, ఏదైనా ప్రత్యేక విమానం మాట్లాడుకుని షర్మిల హుటాహుటిన గన్నవరం విమానాశ్రయంలో దిగితే మాత్రమే.. జగన్ కు షర్మిల రాఖీ కట్టే చాన్సుంటుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇది సాధ్యమా?

Tags:    

Similar News