హాట్ టాపిక్... పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల!!
ఈ క్రమంలో షర్మిళ పులివెందుల నుంచి కానీ, కడప లోక్ సభ స్థానం నుంచి కానీ పోటీ అనేది కచ్చితంగా రాజకీయంగా అత్యంత కీలకమైన విషయంగానే భావించాలి.
కర్ణాటక, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలపై జెండా ఎగరేసిన కాంగ్రెస్.. ఏపీలోనూ పూర్వ వైభవం తెచ్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ పీసీసీ) అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించారు. దీంతో ఇక ఏపీలో షర్మిళ రంగంలోకి దిగబోతున్నారని.. వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించబోతున్నారంటూ కథనాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా షర్మిళ పోటీచేసే స్థానంపైనా ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి.
అవును... అంతా ఊహించినట్లుగానే షర్మిల పొలిటికల్ కెరీర్ సాగుతుంది. తాను తెలంగాణ బిడ్డనంటూ చెప్పి, తెలంగాణ రాజన్నరాజ్యం తెస్తానని చెప్పిన వైఎస్ షర్మిళ... అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండా తప్పుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీ చేయబోయే స్థానం ఇదే అంటూ కథనాలు తెరపైకి వస్తున్నాయి.
ఇందులో భాగంగా... వచ్చే ఎన్నికల్లో వైఎస్ షర్మిళ కడప జిల్లా నుంచే పోటీచేయబోతున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. ఎంపీగా అనుకుంటే కడప లోక్ సభ స్థానం నుంచి, ఎమ్మెల్యేగా అయితే ఏకంగా పులివెందుల నుంచే పోటీ చేయబోతున్నారంటూ ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి. అయితే అది అధిష్టాణం నిర్ణయమా.. లేక, ఈమె సొంత నిర్ణయమా అనేది తెలియాల్సి ఉంది కానీ... ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ అనే చెప్పాలి.
ప్రస్తుతం కడప సిట్టింగ్ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. వచ్చేసారి కూడా ఆయనకు టిక్కెట్ కన్ ఫాం అయ్యిందని తెలుస్తుంది. మరోపక్క పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ జగన్ పోటీచేశారు, చేస్తున్నారు! ఈ క్రమంలో షర్మిళ పులివెందుల నుంచి కానీ, కడప లోక్ సభ స్థానం నుంచి కానీ పోటీ అనేది కచ్చితంగా రాజకీయంగా అత్యంత కీలకమైన విషయంగానే భావించాలి.
వస్తున్న ఊహాగాణాలు నిజమయ్యి షర్మిల.. పులివెందుల నుంచి వైఎస్ జగన్ పై నిలబడితే రాజకీయం ఎలా మారబోతుందనేది ఆసక్తిగా మారింది. ఆ సమయంలో షర్మిళ అన్నపై విమర్శలు చేస్తారా.. అన్న ప్రభుత్వాన్ని ఎండగడతారా.. మరో బ్రదర్ అవినాష్ పై ఎలా విరుచుకుపడతారు అనేది కచ్చితంగా అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారే అవకాశం పుష్కలంగా ఉంది. మరి ఈ ఊహాగాణాలపై షర్మిళ ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!