తుస్సు మనిపించిన షర్మిల పార్టీ...ఇంతనీ అంతనీ చివరికి...!

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఆమె నామినేషన్ల ఘట్టం తొలి రోజు అయిన శుక్రవారం ప్రకటించారు.

Update: 2023-11-03 07:29 GMT

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఆమె నామినేషన్ల ఘట్టం తొలి రోజు అయిన శుక్రవారం ప్రకటించారు. తెలంగాణా ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని చెప్పి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం వైరల్ అవుతోంది.

ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చితే చరిత్ర నన్ను క్షమించదు అని షర్మిల చెప్పుకొచ్చారు. అందుకే హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల యుద్ధంలో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని షర్మిల ప్రకటించారు. ఈ కారణం వల్లనే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ పోటీ చేయట్లేదు అని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు హోదాలో వైఎస్‌ షర్మిల విస్పష్టమైన ప్రకటన చేశారు.

ఇదిలా ఉంటే వైఎస్ఆర్‌టీపీ తరఫున మొత్తం 119 సీట్లలో అభ్యర్ధులను నిలబెడతామని కొద్ది రోజుల క్రితం జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశంలో షర్మిల ప్రకటించారు. అయితే ఆ తరువాత షర్మిల నుంచి ఎలాంటి యాక్టివ్ రోల్ లేకుండా పోయింది అని అంటున్నారు.

ఆమె ఫుల్ సైలెంట్ అయ్యారు. ఈలోగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు కొందరితో ఆమె టచ్ లోకి వెళ్లారని కూడా వినిపిస్తోంది. దాంతో షర్మిలకు వారు నచ్చచెప్పారని, పోటీ చేయకుండా మద్దతు ఇస్తే రేపటి రోజున భవిష్యత్తు ఉంటుందని కూడా వివరించారని అంటున్నారు.

ఇక షర్మిల పార్టీ విషయం చూస్తే మొత్తం సీట్లకు పోటీ అని చెప్పినా సరైన క్యాండిడేట్లు అయితే పార్టీలు లేరు. ఏదో ఒకటి అని పోటీకి ఎవరినో నిలబెడితే అది కాస్తా వికటిస్తే టోటల్ గా తన రాజకీయ జీవితానికే ఫుల్ స్టాప్ పడుతుంది అని కూడా ఆమె ఆలోచించారని అంటున్నారు.

ఇదిలా ఉంటే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని షర్మిల కొద్ది నెలల క్రితం తెగ ప్రయత్నం చేశారు. అయితే అటూ ఇంటూ కండిషన్ల విషయంలో కుదరక ఆమె పోటీకి సై అన్నారు. తీరా చూస్తే ఆమె పార్టీకి పోటీ చేసేందుకు అంత సీన్ అయితే గ్రౌండ్ లెవెల్ లో లేదు అని అభ్యర్ధుల విషయంలోనే తేలిపోయింది అని అంటున్నారు.

ఇక ఆమె స్వయంగా పాలేరు నుంచి పోటీ అని చెప్పినా అక్కడ కూడా కాంగ్రెస్ బీయారెస్ ల మధ్యనే ముఖాముఖీ పోరు సాగనుంది. డిపాజిట్లు తెచ్చుకోవడం కూడా కష్టమే అన్న దాని మీద సర్వేలు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా ఆలోచించిన మీదటనే ఆమె సేఫ్ సైడ్ గా తెలివైన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

పోటీ చేయకపోతే ముందు పార్టీ పరువు తన పరువు నిలబడుతుంది. ఇది గరిష్టమైన లాభం. ఆ తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదో ఒక విధంగా పదవులు దక్కే చాన్స్ ఉంది అని అంటున్నారు. లేదా మరో నాలుగు నెలలలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు ఉంటుందని కూడా ఆలోచించారని అంటున్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ గెలిస్తే ఆ తరువాత షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆమెకు రాజ్యసభ సీటు తో పాటు పార్టీలో ముఖ్య పదవి ఇస్తామని ప్రతిపాదన పెట్టారని అంటున్నారు. మరో వైపు ఈసారి కాంగ్రెస్ ఒక్క ఓటు కూడా చేజారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది అని అంటున్నారు.

అటూ ఇటూ గట్టిగా ఫైటింగ్ ఉన్నపుడు ప్రతీ ఒక్క ఓటూ కీలకమే. కాబట్టి షర్మిల పార్టీని ఎంతో కొంత కన్సిడర్ లోకి తీసుకున్నారని అంటున్నారు. ఏది ఏమైనా షర్మిల మూడేళ్ళ క్రితం పార్టీ పెట్టి పాదయాత్ర వేల కిలోమీటర్లు తిరిగి చివరికి కాంగ్రెస్ కి మద్దతు అంటూ తుస్సుమనిపించారు అన్న విమర్శలు అయితే వస్తున్నాయి. ఆ మాత్రం భాగ్యానికి ఎన్నికల వేళ కాంగ్రెస్ కండువా కప్పుకుంటే పోయేది కదా అన్న మాటలూ ఉన్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే గడచిన వారంలో చాలా మార్పులు వచ్చాయని తెలంగాణా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే తాను పోటీ నుంచి తప్పుకున్నట్లుగా ఆమె చెబుతున్నారు. తమ పార్టీకి చెందిన క్యాడర్ అంతా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం అయితే ఎన్నో ఘోరాలు చూడాల్సి వస్తుందని ఆమె చెబుతున్నారు.

అలా అందుకే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని, ఈ నిర్ణయం తీసుకోవడం తనకు కష్టం, బాధగా ఉందని అన్నారు. అయితే ఇది తెలంగాణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయంగా ఆమె చెప్పుకున్నారు. తాను తప్పు చేస్తే క్షమించండి అని ఆమె కోరుకున్నారు. ఇక వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలు తనను అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలని చెప్పి తన పార్టీ కధను అలా యాంటీ క్లైమాక్స్ కి తిప్పేశారు. చూడాలి మరి షర్మిల మద్దతు, ఆమె రాజకీయ వ్యూహాలు రేపటి రోజున ఎలా ఆమె రాజకీయ జీవితానికి పనికివస్తాయో ఏమో అన్నది.

Tags:    

Similar News