మా నాన్న హత్య కేసులో జగన్ ను కూడా విచారించాలి!
వచ్చే ఎన్నికల్లో తన అన్న (వైఎస్ జగన్) పార్టీకి ఓటేయొద్దని దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు
వచ్చే ఎన్నికల్లో తన అన్న (వైఎస్ జగన్) పార్టీకి ఓటేయొద్దని దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. తన తండ్రి హత్య విషయంలో తన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనకు మొదటి నుంచి అండగా నిలిచారని చెప్పారు.
తన తండ్రి కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రజా కోర్టులో తీర్పు కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా హత్య కేసుల్లో ఎవరు చేశారనేది 4–5 రోజుల్లో తెలిసిపోతుందని సునీత తెలిపారు. వివేకానందరెడ్డి కేసులో ఐదేళ్లయినా ఇంకా ఎందుకు తెలియడం లేదు? అని ప్రశ్నించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తండ్రి పోటీ చేశారని గుర్తు చేశారు. అయితే సొంతవాళ్లే మోసం చేయడంతో ఓడిపోయారన్నారు అయినా నిరాశ చెందకుండా.. రాజకీయాల్లో మరింత చురుగ్గా వ్యవహరించారన్నారు. ఎంత ప్రయత్నించినా ఆయన్ను అణగదొక్కలేకపోతున్నామనే భయం ప్రత్యర్థుల్లో ఎక్కువైందన్నారు. అప్పట్లో తమకు ఇదంతా అర్థం కాలేదన్నారు.
తన తండ్రి వివేకానందరెడ్డిని హత్య చేసిన తర్వాత మార్చి 15, 2019న మార్చురీ బయట ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి తన వద్దకు వచ్చారని సునీత గుర్తు చేసుకున్నారు. రాత్రి 11.30 గంటల వరకు పెదనాన్న తన కోసం ఎన్నికల ప్రచారం చేశారని అవినాష్ రెడ్డి తనతో చెప్పారన్నారు.
సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు మన మధ్యే ఉన్నా మనం మాత్రం రియలైజ్ కాలేమన్నారు. తన తండ్రిని చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది? అని సునీత ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తికావట్లేదు? అని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు ఉండకూడదన్నారు.
తన తండ్రిని గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసు? అని సునీత సందేహం వ్యక్తం చేశారు. ఆ విషయం తేలాలన్నారు. తన తండ్రి వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. వాళ్లిద్దరినీ జగన్ రక్షిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి.. పడుతుందన్నారు. వంచన, మోసానికి పాల్పడిన తన అన్న పార్టీ వైసీపీకి ఓటేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలేనన్నారు.
ఇచ్చిన మాట మీద నిలబడతా.. విశ్వసనీయత అంటూ జగన్ పదేపదే చెబుతున్నారని సునీత ఎద్దేవా చేశారు. కానీ ఈ చెల్లికి ఇచ్చిన మాటను ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాలని కోరారు. సొంత వాళ్లను అంత సులువుగా అనుమానించలేమని.. అందుకే జగన్ ను కలిసినప్పుడు తనకు ఆయనపై అనుమానం రాలేదన్నారు. ఒక్కో వాస్తవం బయటకు వస్తుంటే నమ్మాల్సి వచ్చిందన్నారు. తన తండ్రి హత్య కేసులో 8 మంది పేర్లు బయటకు వచ్చాయని.. ఇంకా రాని పేర్లు చాలా ఉన్నాయన్నారు. జగన్ పాత్రపైనా విచారణ చేయాలని కోరారు. నిర్దోషి అయితే వదిలేయాలని.. తప్పు చేస్తే మాత్రం తప్పించుకోకూడదన్నారు.
నిందితులు ఒక్కసారి బెయిల్ పై బయటకొస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేయరా? అని సునీత ప్రశ్నించారు. జగనన్న కేసుల వల్లే తన తండ్రి హత్య కేసును సాగదీస్తున్నారన్నారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో తనకు తెలియదన్నారు.
తాను కూడా ప్రజల్లోకి వెళ్తానని సునీత హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఎలా వెళ్లాలనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదన్నారు. అనుమానితులుగానే తనను, తన భర్తను అధికారులు ప్రశ్నించారని సునీత చెప్పారు. ప్రభుత్వం నిందితుల వెనుక ఉంది కాబట్టే తమపై కేసులు పెట్టారని ఆరోపించారు. మాలాగే అందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. విచారణ త్వరగా పూర్తిచేసి దోషులను గుర్తించాలని డిమాండ్ చేశారు.