కడపలో పోటీకి కారణం చెప్పిన షర్మిళ... సునీత కామెంట్స్ వైరల్!

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇంతకాలం కూటమి వర్సెస్ వైసీపీ అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో... తాము కూడా బరిలో ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది

Update: 2024-04-02 13:11 GMT

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇంతకాలం కూటమి వర్సెస్ వైసీపీ అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో... తాము కూడా బరిలో ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా... 5 లోక్ సభ, 114 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. ఈ క్రమంలో... కడప లోక్ సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు షర్మిళ ప్రకటించారు!

అవును... రానున్న ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిళ వెల్లడించారు! ఈ సందర్భంగా ఆమె కడపలోనే, అది కూడా లోక్ సభ స్థానానికే పోటీ చేయడానికి గల కారణాలను వివరించారు. అంతకంటే ముందు వైఎస్ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి కూడా షర్మిళ పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలో మీడియాతో మాట్లాడారు షర్మిళ!

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ పార్టీ తరుపున తాను కడప పార్లమెంట్ కి పోటీ చేస్తున్నట్లు చెప్పిన షర్మిళ... ఈ నిర్ణయం అంత సులువైందని కాదని తనకు తెలుసని, ఫలితంగా తమ కుటుంబం నిట్టనిలువునా చీలిపోతుందని తెలిసినా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక గత ఎన్నికల్లో షర్మిళ తనకు చెల్లెలు కాదు.. తన బిడ్డ అని చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారని అన్నారు.

ఈ క్రమంలోనే నా అనుకున్న వాళ్లందరినీ జగన్ నాశనం చేశారని చెప్పిన షర్మిళ... చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లనూ, చేయించినవాళ్లనూ వెనకేసుకొస్తున్న జగన్... హంతకులు తప్పించుకుని తిరుగుతున్నా శిక్షపడకుండా వారిని కాపాడుతున్నారని అన్నారు. ఇదే సమయంలో... చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్ రెడ్డికి వైసీపీ టిక్కెట్ ఇవ్వడం తట్టుకోలేకపోయినట్లు షర్మిళ తెలిపారు.

అనంతరం... తాను కడప ఎంపీగా పోటీ చేయాలనేది తన చిన్నాన్న కోరిక అని చెప్పిన షర్మిళ... ఆయన కోరిక నెరవేర్చడానికే తాను కడప ఎంపీ బరిలో దిగుతున్నట్లు తెలిపారు. హంతకుడైన అవినాష్ రెడ్డిని చట్టసభల్లో అడుగుపెట్టకుండా చేయడమే తన లక్ష్యమని.. కడపలో అతడు గెలవకూడదనే తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు షర్మిళ తెలిపారు!

షర్మిళ అభ్యర్ధిత్వంపై సునీత కామెంట్స్!:

కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న వైఎస్ షర్మిళకు సునీత అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో... ఆమెను ఎంపీ పోటీ చేయించాలని తన తండ్రి శాయశక్తులా ప్రయత్నించారని.. ఈ క్రమంలోనే హత్యకు గురయ్యారని అన్నారు. 2012లో జగన్ జైలుకి వెళ్లినప్పుడు మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసినట్లు గుర్తు చేశారు. ఈ సమయంలో ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న షర్మిలకు మద్దతు తెలుపుతున్నట్లు సునీత ప్రకటించారు!

Tags:    

Similar News