ఏపీ రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-02-13 05:26 GMT

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మరోపక్క ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం తర్వాత ఈ విషయం ప్రధానంగా వార్తల్లో నిలుస్తుంది. అటు మోడీని, ఇటు జగన్ ని విమర్శించడానికి షర్మిళ ఈ అంశాన్ని ప్రధానంగా ఎంచుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా మీద అని చెబుతున్నారు. అయితే... ఈ విమర్శలకు వైసీపీ నేతలు గట్టిగానే తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హోదాపై కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. నాడే ఏపీ మేలు కోరి ఉంటే... విభజన చట్టంలో ఆ అంశం ఎందుకు చేర్చలేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా... వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేక హోదాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి మొదలైన అంశాలపై తాజాగా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలుపై రాజ్యసభలో మాట్లాడతామని, తేద్వారా కేంద్రం మీద ఒత్తిడి తెస్తామని అన్నారు. అదేవిధంగా... వైజాగ్‌ లో పరిపాలన రాజధాని ఏర్పాటుచేసేంత వరకూ హైదరాబాద్‌ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే అంశంపై కేంద్రంతో చర్చిస్తామని తెలిపారు.

ఇదే సమయంలో... ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని అభిప్రాయపడిన సుబ్బారెడ్డి... కేంద్రంలో ప్రభుత్వం బలంగా ఉన్నంత వరకూ ప్రత్యేక హోదా తేవడం కూడా కష్టమేనని అన్నారు. రాష్ట్రంలో పథకాలు సక్రమంగా అమలు చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సత్సంబంధాలు ఉండటం అవసరమని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News