వైసీపీ బీ ఫారం గ్యారంటీ లేదా...!?
ఇటీవల కాలంలో వైసీపీ ముఖ్యనేత తాజాగా రాజ్యసభ సభ్యుడు అయిన వైవీ సుబ్బారెడ్డి వరస బెట్టి మరీ సంచలన కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో వైసీపీ ముఖ్యనేత తాజాగా రాజ్యసభ సభ్యుడు అయిన వైవీ సుబ్బారెడ్డి వరస బెట్టి మరీ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. గత వారం ఆయన ఉమ్మడి క్యాపిటల్ గా హైదరాబాద్ మరి కొన్నాళ్ళు ఉండాలంటూ చేసిన కామెంట్స్ అతి పెద్ద చర్చకు తెర తీశాయి. దాని మీద ఒక టైం లో వైసీపీ డిఫెన్స్ లో పడిపోయింది కూడా. ఇపుడు చూస్తే ఆయన మరో సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు ఒక విధంగా వైసీపీలోని ఇంచార్జిలుగా ఉన్న వారికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా బాంబు లాంటి వార్త ఇది అని అంటున్నారు.
వైసీపీ ఫైనల్ లిస్ట్ మార్చి లో రిలీజ్ చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చల్లగా ఒక కబురు చెప్పారు. ఇప్పటిదాకా చేసిన మార్పు చేర్పులు కొత్తగా వేసిన ఇంచార్జిలు కానీ అలాగే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కానీ ఎవరూ ఎన్నికల్లో అభ్యర్ధులు కారని ఆయన ఒక కూల్ న్యూస్ చెప్పేశారు. ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితాను వైసీపీ అధినాయకత్వం మార్చి 3 తరువాత రిలీజ్ చేస్తుందని ఆయన అంటున్నారు. అలాగే ఎన్నికల మ్యానిఫేస్టోని కూడా అపుడే రిలీజ్ చేస్తుంది అని చెబుతున్నారు.
దీనిని బట్టి చూస్తే కనుక వైసీపీ లో కొత్త ఇంచార్జిలుగా ఉన్న వారు కానీ అలాగే టికెట్ రాదు అని అలిగి దూరంగా ఉన్న వారు కానీ ఎవరూ కూడా ఫీల్ అవాల్సింది లేదన్న సందేశాన్ని వైవీ సుబ్బారెడ్డి ఇచ్చేశారు అని అంటున్నారు. ప్రస్తుతం నియమించినది కో ఆర్డినేటర్లనే తప్ప ఎమ్మెల్యే అభ్యర్ధులుగా ఎంపిక చేయలేదని కూడా చెబుతున్నారు.
దీంతో వైవీ సుబ్బారెడ్డి చెప్పిన మాటలను విన్న వారు అంతా దీని భావమేమి అని డీప్ గా ఫీల్ అవుతున్నారుట. మరి ఇప్పటిదాకా అభ్యర్ధుల జాబితా అంటూ హడావుడి జరిగింది దేని కోసం, వీరు అభ్యర్ధులు కాకపోతే మరి కొత్తగా ఎవరు ఉన్నారు. అసలు ఇపుడు నియమించిన ఇంచార్జిల ప్లేస్ లో కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్ధులు వస్తారా అన్నది కూడా చర్చనీయాంశం అవుతోంది.
అదే జరిగితే తామే అభ్యర్ధులమని భావించి ఖర్చు చేసుకుంటూ ముందుకు పోతున్న వారి సంగతేంటి అన్నది కూడా కొత్తగా చర్చకు వస్తోంది. ఇక ఇప్పటికే డెబ్బై నుంచి ఎనభై అసెంబ్లీ నియోజకవర్గాల దాకా అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇంచార్జిలను మార్చడం జరిగింది. వారే రేపు పార్టీ తరఫున నిలబడతారు అని సంకేతాలు బలంగానే రాజకీయ వర్గాల్లోకి జనంలోకి వెళ్లాయి.
అయితే ఇటీవల వైసీపీ ఇంచార్జిల విషయంలోనూ పలు సర్వేలు చేయించింది అని అంటున్నారు. దాంతో చాలా చోట్ల వారి పెర్ఫార్మెన్స్ బలహీనంగా ఉంది అని అంటున్నారు. దాంతో వారిని తప్పిస్తారు అని వార్తలు వస్తూండగానే టీడీపీ జనసేన తొలి విడత జాబితా రిలీజ్ అయింది. దాన్ని చూసుకుని ఇపుడు ఆయా నియోజకవర్గాలలో ధీటైన అభ్యర్ధులను ఎంపిక చేయడానికి వైసీపీ మరోసారి పూర్తి స్థాయిలో కసరత్తు చేయబోతోంది అని అంటున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో ఇపుడు చేసిన భారీ మార్పు చేర్పులు అలగే ఇంచార్జిల నియామకాలలో ఎందరు తిరిగి వాటిని నిలబెట్టుకుంటారు అన్నది చర్చగా ఉంది. అంతే కాదు ఇంచార్జిలుగా ఉన్న వారే రేపటి ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్న రూల్ ఏమీ లేదు అని తాపీగా వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పిన నేపధ్యంలో ఎవరికీ నిద్ర పట్టని పరిస్థితి ఉంది.
అదే టైంలో చాలా చోట్ల ఆశావహులకు కొత్త ఊపిరి పోసినట్లు అయింది. దాంతో వారు తమ అభ్యర్ధిత్వాలను అదృష్టాలను పరిశీలించుకోవడానికి మరో అవకాశం అలా పార్టీ ఇచ్చింది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైవీ సుబ్బారెడ్డి ఫుల్ క్లారిటీగానే చెప్పేశారు.
ఇపుడు ఉన్న వారు కో ఆర్డినేటర్లే సుమా అన్నదే ఆయన సందేశం తుది జాబితా రిలీజ్ అవుతుంది. ఒకేసారి 175 మంది అభ్యర్ధుల లిస్ట్ రిలీజ్ చేస్తాం అపుడే ఎమ్మెల్యే సీటుకు కానీ ఎంపీ సీటుకు కానీ వారు అభ్యర్ధులు అవుతారు అని అంటున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఎవరి సీటుకూ గ్యారంటీ లేదు అన్న సందేశాన్ని మాత్రం ఆయన ఇచ్చేశారు. ఫైనల్ లిస్ట్ లో ఎవరుంటారు ఎవరు ఉండరు అన్నదే చూడాల్సి ఉంది. దీని బట్టి చూస్తే బీ ఫారాలు ఎవరికి దక్కుతాయన్నది వైసీపీలో ఇపుడు అతి పెద్ద టెన్షన్ గా ఉందని అంటున్నారు.