కేసీయార్ కు రైతుల షాక్
ఎన్నికల బిజీలో ఉన్న కేసీయార్ కు జహీరాబాద్ రైతులు పెద్ద షాకే ఇచ్చారు. ఈనెల 23వ తేదీన జహీరాబాద్ బంద్ కు పిలుపిచ్చారు
ఎన్నికల బిజీలో ఉన్న కేసీయార్ కు జహీరాబాద్ రైతులు పెద్ద షాకే ఇచ్చారు. ఈనెల 23వ తేదీన జహీరాబాద్ బంద్ కు పిలుపిచ్చారు. అదేరోజు పట్టణంలో కేసీయార్ బహిరంగసభ ఉంది. జహీరాబాద్ బహిరంగసభలో పాల్గొనేందుకు కేసీయార్ వస్తున్నారు కాబట్టే రైతులు పట్టణం బంద్ కు పిలిపివ్వటం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే పట్టణంలో ట్రైడెంట్ చెక్కర ఫ్యాక్టరీ ఉంది. దీన్ని చాలాకాలం క్రితమే మూసేశారు. దాంతో వేలాదిమంది ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడ్డారు.
అలాగే ఫ్యాక్టరీ మూసివేతతో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాక్టరీని నమ్ముకునే వందలాది మంది చెరకు రైతులు పంటలు పండించేవారు. అలాంటిది ఫ్యాక్టరీని సడెన్ గా మూసేయటంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఫ్యాక్టరీని తెరిపిస్తానని అప్పుడెప్పుడో కేసీయార్ హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని కేసీయార్ మరచిపోయారు. హామీ విషయాన్ని ఎన్నిసార్లు గుర్తుచేసినా ఉపయోగంలేకపోయింది. మంత్రులు, ఎంఎల్ఏలకు చెప్పినా ఫలితం కనబడలేదు.
ఈ నేపధ్యంలోనే ఎన్నికలు వచ్చాయి. అందుకనే జహీరాబాద్ ఫ్యాక్టరీ ముందు సోమవారం రైతులు, మాజీ ఉద్యోగులు, కార్మికులు సమావేశం జరిపారు. వంటా వార్పు నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని, చెరకు క్రషింగ్ మొదలుపెట్టాలని, బకాయిలను వెంటనే చెల్లించాలనే డిమాండ్లు చేశారు. తమ డిమాండ్లను వెంటనే కేసీయార్ పరిష్కరించాలని రైతులు నిరసన కార్కక్రమంలో తీర్మానించారు.
అలాగే సమస్యల తీవ్రత కేసీయార్ కు తెలియాలన్న ఉద్దేశ్యంతోనే సరిగ్గా 23వ తేదీనే జహీరాబాద్ బంద్ కు పిలుపిచ్చారు. పట్టణం బంద్ కు రైతులు, మాజీ ఉద్యోగులు, కార్మికులు ఇచ్చిన పిలుపుకు ప్రతిపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి. దాంతో పట్టణంలో అధికారయంత్రాంతో పాటు బీఆర్ఎస్ లో ఒక్కసారిగా టెన్షన్ మొదలైపోయింది. ఒకవైపు జహీరాబాద్ బంద్ మరోవైపు కేసీయార్ బహిరంగసభ ఏమి చేయాలో ఇపుడు అధికార యంత్రాగానికి పాలుపోవటంలేదు. బంద్ లేదా బహిరంగసభ ఏదో ఒకదాన్ని రద్దుచేసుకోవాలి. బహిరంగసభ గనుక రద్దయితే ఇంతకుమించిన అవమానం బీఆర్ఎస్ కు ఉండదు. ఈ నేపధ్యంలోనే 23న ఏమి జరగబోతోందనే టెన్షన్ పెరిగిపోతోంది.