పోల్ డే.. ఎక్కడెక్కడ రిగ్గింగ్ చేయాలో చెప్పేసిన జెడ్పీటీసీ!
ఇదేం తప్పు కాకున్నా.. ఈ సందర్భంగా కొందరు నేతల నోటి నుంచి వస్తున్న మాటలు మాత్రం బరితెగింపుకు మించినట్లుగా ఉండటం షాకింగ్ గా మారింది.
ఆలోచన ఉండే మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడినా నడిచిపోతుందన్న భావన అంతకంతకూ ఎక్కువ కావటమే కాదు.. హద్దులు దాటేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు.. మూడు రోజుల్లో లోక్ సభ ఎన్నికలకు.. కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల్ని సైతం కలిసి నిర్వహిస్తారన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు అనుగుణంగా తమ కార్యకలాపాల్ని ముమ్మరం చేసుకుంటున్నాయి. ఇదేం తప్పు కాకున్నా.. ఈ సందర్భంగా కొందరు నేతల నోటి నుంచి వస్తున్న మాటలు మాత్రం బరితెగింపుకు మించినట్లుగా ఉండటం షాకింగ్ గా మారింది.
పోల్ మేనేజ్ మెంట్ ఎలా చేయాలి? ప్రత్యర్థిని ఎలా దెబ్బ తీయాలన్న వ్యూహాలు పాతవే అయినా.. కలలో కూడా ఊహించని రీతిలో ఓపెన్ గా.. పోలింగ్ రోజున ఎక్కడెక్కడ రిగ్గింగ్ చేయాలన్న విషయాల్ని సైతం ఓపెన్ గా మాట్లాడేసుకోవటం సంచలనంగా మారింది. దీనికి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వేదికైంది. సంతబొమ్మాళి జడ్పీటీసీ సభ్యుడు పాల వసంతరెడ్డి తాజాగా మాట్లాడుతూ.. రిగ్గింగ్ గురించి జంకు బొంకు లేకుండా అంత ఓపెన్ గా మాట్లాడేయటమా? అన్న ప్రశ్నతలెత్తుతోంది.
మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పేరాడ తిలక్.. టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. వారి సమక్షంలో తన వ్యూహాన్ని బహిరంగంగా చెప్పేశారు జెడ్పీటీసీ వసంతరెడ్డి. పోలింగ్ రోజు ఉదయం 9 గంటలకు హనుమంతునాయుడుపేట సచివాలయ బూత్ లో రిగ్గింగ్ చేయనున్నట్లుగా వెల్లడించారు.
అంతేకాదు మండలం పరిధిలోని 20 గ్రామ సచివాలయాల్లో వైసీపీకి అనుకూలంగా రిగ్గింగ్ చేస్తామన్న ఆయన.. కార్యకర్తలకు సైతం రిగ్గింగ్ ఎలా చేయాలన్న పాఠాల్ని చెప్పేయటం షాకింగ్ గా మారింది. ఈ తరహా వ్యవహార శైలి ఉన్న నేతల్ని కట్టడి చేయటంతో పాటు.. చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటున్నారు. ఎంత బరితెగింపు కాకుంటే రిగ్గింగ్ చేసే టైం సైతం ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే చెప్పేయటం ఈ మొత్తం ఎపిసోడ్ లో అసలుసిసలు ట్విస్టు.