నారాయణ స్వామికి చెక్ పెడుతున్న కీలక నేత.. ఏం జరుగుతోందంటే
వైసీపీ నాయకుడు ఎస్సీ నేత మంత్రి కిలత్తూరు నారాయణస్వామి పరిస్థితి అడకత్తెర లో పోక మాదిరిగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
వైసీపీ నాయకుడు ఎస్సీ నేత మంత్రి కిలత్తూరు నారాయణస్వామి పరిస్థితి అడకత్తెర లో పోక మాదిరిగా మారిందని అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయం వైసీపీ లోనూ చర్చకు వస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం మాట ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఆయన కు టికెట్ దక్కడం కూడా కష్టమనే సంకేతాలు వచ్చాయి. దీంతో నారాయణస్వామి నిర్వేదం లో మునిగిపోయారని అంటున్నారు. ఇటీవల తరచుగా ఆయన అగ్రవర్ణ నేతల ను టార్గెట్ చేయడం వెనుక కూడా ఇదే రీజన్ ఉందని అంటున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు(ఎస్సీ) నియోజకవర్గం నుంచి నారాయణ స్వామి వరుస విజయాలు దక్కించుకున్నారు. 2014 2019 ఎన్నికల్లో ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. వేపంజేరి నియోజకవర్గంగా ఉన్న దాని ని విభజన చేసి.. 2009లో గంగాధర నెల్లూరు అనే కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేశారు. 2009లో కుతూహలమ్మ ఇక్కడ నుంచి విజయం దక్కించుకుని డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు.
ఇక తర్వాత.. ఎన్నికల కు వచ్చేసరికి అంటే.. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకుని.. ఆ పార్టీ టికెట్ పై పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో నారాయణస్వామి విజయం దక్కించుకు న్నారు. తర్వాత కుతూహలమ్మ.. తన కుమారుడు హరికృష్ణను రంగం లోకి దించారు. ఈయన 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక తర్వాత జరిగిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో హరికృష్ణ కుతూహలమ్మలు వైసీపీ చెంత కు చేరిపోయారు.
ఈ ఏడాది కుతూహలమ్మ కాలం చేసిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు హరికృష్ణ మాత్రం రాజకీయాల్లో ఉన్నారు. రెండు మాసాల కిందట సీఎం జగన్ ను కలిసి.. టికెట్ ను కూడా అభ్యర్థించారు. అయితే.. గ్రాఫ్ పెంచుకోవాల ని సీఎం సూచించడంతో ప్రస్తుతం ఆయన ఆ పనిమీదే ఉన్నారు. ఇక స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుల కు మంత్రి నారాయణస్వామికి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో ఆయన ను తప్పించి హరికృష్ణకు టికెట్ ఇవ్వాలనే నినాదం అంతర్గత చర్చల్లో జోరుగా వినిపిస్తోంది. దీంతో ఆయన కు అవకాశం ఇచ్చే చాన్స్ ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. హరికి టికెట్ ఇస్తే.. రెండు ప్రయోజనాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఒకటి.. కుతూహలమ్మ మరణంతో ఏర్పడిన సింపతీ రెండు మంత్రి నారాయణస్వామి పై ఉన్న వ్యతిరేకత. ఈ రెండు కూడా హరికృష్ణ విజయానికి కారణమవుతారని చెబుతున్నారు. మరి సీఎం జగన్ ఏం చేస్తారో చూడాలి.