బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ కు సుప్రీంలో ఊరట
ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2022లో విఠల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పిటిషన్ విచారణను జులైకి వాయిదా వేసింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2022లో విఠల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ఆ ఎన్నికల్లో పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాజేశ్వర్ రెడ్డిని పోటీ నుంచి తప్పించడమే లక్ష్యంగా విఠల్ ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరణకు గురైంది.
దీనిపై రాజేశ్వర్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. తాను నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదని, కాబట్టి విఠల్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో విఠల్‌కు ఊరట లభించింది.