త్వరలో కులమతాలు లేని బర్త్ సర్టిఫికేట్... హైకోర్టు కీలక ఆదేశాలు!

కులమత రహిత సమాజం దిశగా కీలకఅడుగు

Update: 2023-07-20 06:42 GMT

భారతదేశం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందకపోవడానికి.. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే చెప్పుకోవడానికి.. అణుబాంబులకు గురైన దేశాలు, మంచి నీరు దొరకని దేశాలు సైతం టాప్ ప్లేస్ లో ఉంటుండగా... భారత దేశం మాత్రం ఇంకా ఇలా ఉండటానికి గల ప్రధాన కారణాల్లో కులం, మతం ప్రధానమైనవని అంటుంటారు పరిశీలకులు.

భారతదేశంలో ప్రజలకు కులమతాల సమస్య అత్యంత పెద్దది అని అంటుంటారు. మరోపక్క రాజకీయనాయకులకు అదే శ్వాస, ద్యాస అని.. వారి మనుగడకు ఇవే ఇందనాలని చెబుతుంటారు. అందుకే వీలైనంత వరకూ ప్రజలను కులాలుగా, మతాలుగా విభజించడానికే దాదాపు అన్ని రాజకీయ పార్టీలో అత్యుత్సాహం చూపిస్తుంటాయని చెబుతుంటారు.

మరోపక్క ఈ మధ్యకాలంలో కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్న ఘటనలు కాస్త ఎక్కువగానే తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో కులం లేకుండా, మతం ప్రస్థావన రాకుండా బ్రతికే అవకాశం కల్పించే దిశగా ఒక ఆప్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి.. హైకోర్టు సూచించింది! ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

అవును... పుట్టిన బిడ్డలకు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే సమయంలో.. కులం-మతం వద్దనుకునే వారికి వీలుగా ఒకప్రత్యేక కలం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. కులాన్ని మతాన్ని వదలుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని ఈ సందర్భంగా పేర్కొంది.

అదేవిధంగా... కులమతాల ప్రస్తావన లేకుండా బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో... తెలంగాణ హైకోర్టు తీర్పు చాలా గొప్ప పరిణామం అని అంటున్నారు... కులమత రహిత సమాజం కోరుకునే జనాలు!

హైదరాబాదులో సందెపు స్వరూప అనే మహిళ కులమతాల ప్రస్తావన లేకుండా బర్త్ సర్టిఫికెట్ కోసం అప్లయి చేసుకునే వెసులుబాటు కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. అయితే దీనిని పిటిషన్ గా మార్చి విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం... ఈ మేరకు ఈ తీర్పు వెలువరించిందని తెలుస్తుంది.

ఈ సందర్భంగా... రాజ్యాంగంలోని 25వ అధికరణం ప్రకారం.. నచ్చిన మతం ఆచరించే హక్కు ఎలాగైతే అందరికీ ఉంటుంది.. అలాగే ఏ మతాన్నీ ఆచరించకుండా ఉండడానికి కూడా హక్కు ఉందని తీర్పులో పేర్కొంది న్యాయస్థానం. దీంతో... కాలక్రమంలో కులమతాలు లేని సమాజం తప్పకుండా ఆవిష్కృతం అవుతుందనే నమ్మకం బలమపడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News