అప్పటి వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు
తాజాగా మంగళవారం జరిగిన విచారణలో తీర్పు వచ్చే వరకు ఆయనను అరెస్టు చేయొద్దని కోర్టు తేల్చి చెప్పింది.
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తీర్పు వచ్చే వరకు ఆయనను అరెస్టు చేయొద్ద ని న్యాయస్థానం తేల్చి చెప్పింది. 'ఫార్ములా ఈ-రేస్' వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విష యం తెలిసిందే. దీనిపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని.. దీనిని కొట్టి వేయాలని ఆయన కోరారు. తాజాగా మంగళవారం జరిగిన విచారణలో తీర్పు వచ్చే వరకు ఆయనను అరెస్టు చేయొద్దని కోర్టు తేల్చి చెప్పింది. విచారణ ముగియడంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది.
46 కోట్ల దుర్వినియోగం!
ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో కేటీఆర్ రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం చేశారని ఏసీబీ అధికారుల తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టు కు వివరించారు. ఒప్పందం జరగకుండానే.. 46 కోట్ల రూపాయలను ముందస్తుగానే చెల్లించారని చెప్పారు. ప్రస్తుతం కేసువిచారణ ముమ్మరంగా సాగుతోందని.. అన్ని ఆధారాలు బయటకు వస్తాయని తెలిపారు. గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతే కేటీఆర్‌పై కేసు నమోదు చేసినట్టు వివరించారు. అయితే.. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. ఈ కేసు ప్రాధాన్యం దృష్ట్యా పిటిషన్ ను తిరస్కరించాలని విన్నవించారు.
ఈ కేసు పెట్టిన దానకిశోర్ తరఫు న్యాయవాది కూడా కేసును కొట్టి వేయవద్దని కోర్టుకు విన్నవించారు. అప్పట్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగిందన్నారు. ఆయన సంతకాలు పెట్టిన తర్వాతే నిధులు విడుద లయ్యాయని.. కాబట్టి ఈ కేసులో ప్రధాన పాత్రధారి కేటీఆరేనని వివరించారు. నిధుల దుర్వినియోగం నుంచి ఈ కేసులో అన్ని రకాలుగా నిబంధనలను ఉల్లంఘించారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను రద్దు చేయాలని విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.. తీర్పు వచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.