పుష్ప 2 : ఇప్పుడు ఏం చేయలేమన్న హైకోర్టు

దాంతో పుష్ప 2 టికెట్ల రేట్లు మరీ ఎక్కువ అయ్యాయి అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది.

Update: 2024-12-03 10:11 GMT

అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన పుష్ప 2 సినిమా రేపటి నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్‌ 5న సినిమా విడుదల కాబోతున్నా ఒక్క రోజు ముందే తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్ షోలు వేయబోతున్నారు. ప్రీమియర్‌ షోలకు నైజాం ఏరియాలో వెయ్యి రూపాయలకు పైగా టికెట్‌ రేట్లు పెంచారు. ఇక ఏపీలోనూ అదే స్థాయిలో దాదాపుగా రూ.800 టికెట్‌ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం జరిగింది. దాంతో పుష్ప 2 టికెట్ల రేట్లు మరీ ఎక్కువ అయ్యాయి అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది.

అధిక టికెట్ల రేట్ల కారణంగా సినిమాను అడ్డుకోవాలి అంటూ పిటీషనర్‌ తన పిటీషన్‌లో పేర్కొనడం జరిగింది. విచారణకు అనుమతించిన కోర్టు వాదనలు విన్న తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సినిమాను అడ్డుకోలేమని తేల్చి చెప్పింది. చివరి నిమిషంలో సినిమాను అడ్డుకోవడం అసాధ్యం అని, ఇప్పటికే టికెట్ల రేట్లు పెంపుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి, టికెట్ల అమ్మకాలు సైతం జరిగాయి. ఇలాంటి సమయంలో కోర్టు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. సినిమా విడుదల అడ్డుకోవడం, టికెట్ల రేట్లు తగ్గించడం కోర్టుకు ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు అన్నట్టుగా ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

సినిమా టికెట్ల రేట్లు అధికంగా ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సమయంలో కొందరు ఫ్యాన్స్ నిర్మాతలు మాట్లాడుతూ ఉన్నప్పుడు గట్టిగా సర్‌ టికెట్ల రేట్లు మరీ రూ.1200 అంటే ఎలా అంటూ ప్రశ్నించారు. అందుకు నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అల్లు అర్జున్‌ సైతం ఈ విషయంలో ఏమీ చేయకుండా సైలెంట్‌గా ఉండటంను కొందరు ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. ఫ్యాన్స్‌ను ఆర్మీ అంటూ పిలుచుకుంటున్నా అంటూ చెప్పే అల్లు అర్జున్‌ ఈ విషయంలో ఫ్యాన్స్‌కి అండగా నిలబడే అవకాశం లేదా అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప పార్ట్‌ 1 ఏపీలో అతి తక్కువ టికెట్ల రేట్లకు నడిచింది. ఇప్పుడు ఆ టికెట్ల రేట్లతో పోల్చితే పదుల రెట్లు అధికంగా ఉన్నాయి. తెలంగాణలోనూ సినిమాకు భారీ ఎత్తున టికెట్ల రేట్లు పెంచడంతో రికార్డ్‌ స్థాయి ఓపెనింగ్స్ దక్కడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. సినీ వర్గాల వారు, బాక్సాఫీస్ వర్గాల వారి అంచనా ప్రకారం పుష్ప 2 మొదటి రోజు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్‌ ను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి వారం రోజులు సినిమాకు భారీ ఎత్తున వసూళ్లు వస్తాయి. కనుక మొదటి వారం రోజుల్లోనే వెయ్యి కోట్లను మించే అవకాశాలు ఉన్నాయి. సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారానే ఇప్పటికే వంద కోట్లకు పైగా నమోదు కావడం విశేషం.

Tags:    

Similar News