“ముస్లిం మహిళలు భరణం”... సుప్రీంకోర్టు కీలక తీర్పు!

ముస్లిం మహిళలకు విడాకుల తర్వాత ఇచ్చే భరణం విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Update: 2024-07-10 09:51 GMT

ముస్లిం మహిళలకు విడాకుల తర్వాత ఇచ్చే భరణం విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా... విడాకుల తర్వాత ముస్లిం మహిళలు కూడా భరణానికి అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలన విషయంగా మారిందని అంటున్నారు.

అవును... విడాకులు తీసుకున్న తర్వాత ముస్లిం మహిళలు కూడా భరణం తీసుకోవచ్చని, అందుకు వారు కూడా అర్హులేనని తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 125 సీఆర్పీసీ ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

అయితే జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ అగస్టీన్, జస్టిస్ జార్జ్ మాసిష్ లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. విడాకుల తర్వాత తమ మాజీ భార్త నుంచి ముస్లిం మహిళలు భరణం కోరవచ్చని సంచలన తీర్పునిచ్చింది. ఇదే సమయంలో... ఈ హక్కును కల్పించే ఆ సెక్షన్ ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.

ఈ సందర్భంగా స్పందించిన ధర్మాసనం... ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం 1986 సెక్యులర్ చట్టాన్ని అధిగమించలేదని పేర్కొంది. ఇదే సమయంలో సెక్షన్ 125 మహిళలందరికీ వర్తిస్తుందని తెలిపింది. మతంతో సంబంధం లేకుండా ఈ సెక్షన్ కింద వివాహితలు భరణం కోరవచ్చని స్పష్టం చేసింది.

ఇదే సమయంలో భరణం ఇవ్వడం అనేది ఎట్టిపరిస్థితుల్లోనూ ధాతృత్వం కాదని.. భార్య తమపై మానసికంగా, ఇతర రకాలుగా ఆధారపడి ఉంటుందనే వాస్తవాన్ని కొంతమంది భర్తలు గుర్తించడం లేదని పేర్కొంది. గృహిణి పాత్రను, ఆమె త్యాగాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చిందని స్పందించింది.

Tags:    

Similar News