టీహైకోర్టు సంచలన తీర్పు.. వాడికి ఉరే సరి

ఈ కేసుకు సంబంధించిన మరో అరుదైన అంశం ఏమంటే.. తెలుగు రాష్ట్రాల్లో కింది కోర్టులు ఇచ్చిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయటం ఇదే తొలిసారి కావటం

Update: 2024-08-01 06:34 GMT

దాదాపు ఏడేళ్ల క్రితం హైదరాబాద్ మహానగరంలో ఐటీ నగరిగా వెలిగిపోతున్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఒక దారుణ ఉదంతానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. 2017లో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం నిందితుడ్ని దోషిగా తేలుస్తూ.. వాడికి ఉరి వేయాలంటూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదనేనని తేల్చింది. ఈ కేసుకు సంబంధించిన మరో అరుదైన అంశం ఏమంటే.. తెలుగు రాష్ట్రాల్లో కింది కోర్టులు ఇచ్చిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయటం ఇదే తొలిసారి కావటం.

అసలేం జరిగిందంటే.. నార్సింగ్ అలకాపురి టౌన్ షిప్ లో భవన నిర్మాణ కార్మికుల శిబిరం వద్ద 2017 డిసెంబరు 12న మధ్యాహ్నం వేళ అడుకుంటున్న చిన్నారికి మధ్యప్రదేవ్ కు చెందిన దినేశ్ కుమార్ చాక్లెట్ ఆశ చూపి తీసుకెళ్లాడు. అతను చాక్లెట్ ఇప్పిస్తానని తీసుకెళుతున్నప్పుడు.. చిన్నారి తల్లి చూసింది. అయితే.. పక్కింటి అతనే కావటం.. పరిచయస్తుడే కదా? చిన్నపిల్లను ఏం చేస్తాడని భావించింది.

కానీ.. ఆ చిన్నారిని దూరానికి తీసుకెళ్లి పొదల్లో రెండుసార్లు అత్యాచారం చేయటం.. ఆ రాక్షసకాండకు ఆ పసిప్రాణం అపస్మారక స్థితికి చేరుకుంది. ఇంత చేసిన ఆ దుర్మార్గుడు తన పాపం తెలుస్తుందన్న ఉద్దేశంతో చిన్నారి తలపై సిమెంట్ రాయితో బాది చంపేశాడు. ఏమీ తెలియనట్లు వెనక్కి వచ్చాడు. సాయంత్రం వరకు కుమార్తె ఆచూకీ కోసం వెతికిన తల్లిదండ్రులు దినేశ్ ను అనుమానించటం.. ఆ విషయాన్ని పోలీసులకు చెప్పటంతో అసలు ఘోరం బయటకు వచ్చింది. పోలీసులకు తాను చేసిన దారుణాన్ని చెప్పి ఒప్పుకున్నాడు.

వాంగ్మూలాల్ని.. ఆధారాల్ని పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కోర్టు 2021 ఫిబ్రవరి 9న దినేశ్ కు ఉరిశిక్షను విధించింది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ అతడు క్రిమినల్ అప్పీలు దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ పి. శ్యాంకోశీ.. జస్టిస్ సాంబశివరావునాయుడుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి.. అతడికి విధించిన ఉరి సరైనదేనని స్పష్టం చేస్తూ.. తీర్పును ఇచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. ఉరి ఎందుకు సరి అన్నామన్న విషయాన్ని అందులో పేర్కొంటూ.. ‘‘ఇంటి ముందు ఆడుకుంటున్న అభం శుభం తెలియని చిన్నారికి చాకెలెట్ ఆశ చూపి తీసుకెళ్లాడు. పొరుగింటి వ్యక్తి కావటంతో నమ్మకంతో వెళ్లిన చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పశువాంఛ తీరగానే సిమెంట్ రాయితో తల చితక్కొట్టి దారుణంగా చంపేశాడు. ఇలాంటి చర్య క్షమార్హం కాదు. ఇలాంటి వారి కారణంగా పిల్లలు పొరుగింటికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వస్తుంది. ఇది అత్యంత అరుదైన కేసు. ఇందులో నిందితుడికి ఉరే సరైన శిక్ష’’ అంటూ తన తీర్పును వెల్లడించింది.

ఈ కేసు అత్యంతఅరుదైనది అన్నది ఎందుకో వివరిస్తూ మరో కీలక వ్యాఖ్య చేసింది. ‘‘హేయమైన నేరాల్లో నిందితులకు ఉరిశిక్ష విధించాలా లేదా అన్నదానిపై సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మరణశిక్ష తప్పదని భావించినప్పుడు జీవితఖైదు విధించాలన్న ప్రతిపాదన ఉంది. జీవితఖైదు సరిపోదని భావించినప్పుడే ఉరిశిక్ష విధించాలని సుప్రీంకోర్టు పదే పదే చెబుతోంది. అత్యంత అరుదైన కేసు అన్నదానికి చట్టప్రకారం నిర్వచనం లేదు.ప్రతి కేసులోనూ అక్కడ క్రూరత్వం.. నేరస్తుడి ప్రవర్తన ఆధారంగా ఉంటుంది. తప్పిపోయిన కుమార్తె డెడ్ బాడీని ఆ స్థితిలో చిన్నారి తల్లిదండ్రులు చూసినప్పుడు వారి దయనీయ పరిస్థితిని ఎవరూ ఊహించలేరు. తల్లిదండ్రులు పొరుగింట్లో ఇలాంటి రాక్షసుడు ఉంటాడని అనుకోరు. నిందితుడికి తాను హత్య చేసిన చిన్నారి వయసులో ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా.. అనాగరికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యంత అరుదైన ఈ కేసులో ఉరిశిక్ష సరైనదే’’ అంటూ స్పష్టం చేశారు.

Tags:    

Similar News