'భగవద్గీత..' బ్రిటన్ పార్లమెంటు చెబుతున్న సమగ్ర సారాంశం!!
''భగవద్గీత.. మహాభారతము యొక్క సమగ్ర సారాంశము''- అంటూ ఘంటసాల స్వరం వినిపించడం మనకు తెలిసిందే
''భగవద్గీత.. మహాభారతము యొక్క సమగ్ర సారాంశము''- అంటూ ఘంటసాల స్వరం వినిపించడం మనకు తెలిసిందే. కానీ, మన దేశంలో.. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే. ఒకప్పుడు ప్రతి ఇంటా భగవద్గీత ఉదయాన్నే శుప్రభాత వేళ వినిపించేది. కానీ.. ఎక్కడ ఏం జరిగిందో.. ఎవరు ఏం చెప్పారో కానీ.. ఇప్పుడు కేవలం మృతదేహాల వద్ద, వాటిని తీసుకువెళ్లే వాహనాల వద్ద మాత్రమే భగవద్గీత పరిమితం అయింది. మరి ఆ సమయంలో ఎవరు వినాలన్న ఉద్దేశమో పెట్టిన వారికే తెలియాలి.
ఇక, కొన్ని కొన్ని ఆలయాల్లో మాత్రం అంతో ఇంతో భగవద్గీత వినిపిస్తున్న పరిస్థితి ఉన్నా.. రాను రాను ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇటీవల హైదరాబాద్ లో భగవద్గీత శ్లోకాల పోటీ పెడితే.. పట్టుమని 22 మంది పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారట! ఇదీ.. ఇప్పుడు గీతా సారాంశం!! అంటే.. మనం 'గీత'కు దూరమవుతు న్నాం.. 'గీత'ను దాటేస్తున్నాం కూడా. ఇటీవల మన పార్లమెంటు సభ్యులు ప్రమాణం చేసినప్పుడు.. దేవుడిపై ప్రమాణం చేసిన వారు ఉన్నారు.. కానీ, భగవద్గీతపై ప్రమాణం చేసిన వారు కనిపించలేదు.
అయితే.. చిత్రం ఏంటంటే.. భారత దేశం నుంచి ఖండాంతరాలు దాటుకుని పొరుగు దేశాలకు వెళ్లిన వారు కొంతలో కొంత భారతీయ సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బ్రిటన్ ఎన్నికల్లో గెలిచిన 26 మంది పార్లమెంటు సభ్యుల్లో 22 మంది సభ్యులు భగవద్గీతను తమ వెంట తీసుకుని పార్లమెంటుకు వెళ్లడం.. ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు.. పార్లమెంటు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో భగవద్గీతపై ప్రమాణం చేసినవారు 8 మంది ఉండగా.. మరికొందరు గీతా పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ప్రమాణం చేశారు.
ఈ పరిణామం గమనిస్తే.. బ్రిటన్ పార్లమెంటుకు భగవద్గీత చేరిందనే ప్రశంసలతోపాటు.. భారత్‌లో దీనిపై అవగాహన తగ్గుతున్నదనే భావన కూడా కనిపిస్తోంది. మొత్తానికి మనం వదిలేస్తున్న సంస్కృతి, ఇతిహాసాలు, పురాణాలను పొరుగు దేశాలు.. ఖండాంతర దేశాలు అందిపుచ్చుకోవడం.. గమనార్హం.