అమ‌ర్ నాథ్ యాత్ర‌లో మ‌రో విషాదం

Update: 2017-07-16 10:52 GMT
అమ‌ర్ నాథ్ యాత్ర‌లో మ‌రో దుర్ఘ‌ట‌న జ‌రిగింది. గ‌త వారం జ‌రిగిన ఉగ్ర‌దాడి విషాదాన్ని ప్ర‌జ‌లు మ‌ర‌చిపోక ముందే ఆదివారం మ‌ధ్యాహ్నం మ‌రో ప్ర‌మాదం జ‌రిగింది. రాంబాణ్‌ జిల్లాలోని జాతీయరహదారిపై 46 మంది భక్తులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో 11 మంది యాత్రికులు దుర్మరణం పాల‌య్యారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న వెంట‌నే పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను హెలికాప్టర్లలో చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. బ‌నీలాల్ స‌మీపంలోని జాతీయ ర‌హ‌దారి వ‌ద్ద బ‌స్సు అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయింద‌ని సీనియ‌ర్ సూప‌రింటెండెంట్  ఆఫ్ పోలీస్ మోహ‌న్ లాల్ తెలిపారు. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌న్నారు.

కాగా, గత వారం అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 8 మంది యాత్రికులు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది లష్కరే తోయిబా ఉగ్రవాదులేనని జమ్మూకశ్మీర్‌ లో పోలీసులు వెల్లడించిన సంగతి విదితమే. ఆ దాడి అనంత‌రం అమ‌ర్ నాథ్ యాత్ర‌కు భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు. ఆగస్ట్‌ 7న అమర్‌నాథ్‌ యాత్ర ముగియనుంది.
Tags:    

Similar News